చరిత్ర సృష్టించటం, దాన్ని తిరగరాయటం, వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టడం అందరివల్లా కాదు. ప్రపంచాన కోట్లమందిలో ఒక్కరికి కూడా ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కొన్ని తరాలకు ఒకరైనా అలాంటివారు ఉద్భవిస్తారంటే నమ్మలేం. అలాంటి అరుదైన విశిష్ట వ్యక్తుల్లో గురువారం రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. పేదింట పదిమంది సంతానంలో ఒకరిగా, కిరోసిన్ లాంతరు దగ్గర చదువుకున్న మన్మోహన్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఉన్నతమైనవి.
1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆయనే నమ్మలేదు. అప్పటికే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు. జెనీవా కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఆర్థిక మేధావుల బృందం సౌత్ కమిషన్‌కు సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. యూజీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించటానికి అవసరమైన వాగ్ధాటి, సులభంగా చొచ్చుకుపోయే తత్వంలేని ఒక విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు దేశానికి ఆర్థికమంత్రేమిటని ఆశ్చర్యపోయారు.
కానీ అందరూ అనుకున్నట్టు ఆయన సాధారణ వ్యక్తి కాదని త్వరలోనే అర్థమైంది. దేశాన్ని ప్రగతి పట్టాలెక్కించి శరవేగంతో పరుగులెత్తించగల నూతన ఆర్థిక విధానాలను సృజించటంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గలవాడని సర్వులూ గ్రహించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగనిది. ఫేబియన్ సోషలిజం భావనల ఆధారంగా నెహ్రూ విరచించిన సామ్యవాద ఆర్థిక విధానాల నుంచి లేశమాత్రం వైదొలగినా దేశం అధోగతి పాలవుతుందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించేది.
మరోపక్క రకరకాల నియంత్రణలతో ‘లైసెన్స్ రాజ్’గా అపకీర్తి పాలైంది మన వ్యవస్థ. ఎన్నో ఆర్థిక క్లేశాలతో, మరెన్నో ఒడుదొడుకులతో ఉన్న ఆ వ్యవస్థకు తన వినూత్న బడ్జెట్‌తో సంపూర్ణ జవసత్వాలిచ్చినవారు మన్మోహన్. అన్యుల కీర్తిని అపహరించటానికి ససేమిరా ఇష్టపడని పీవీ... ఆర్థిక సంస్కరణల కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని చాటారు.
అందువల్లే సారథిగా పీవీయే ఉన్నా సంస్కరణల ఆద్యుడిగా మన్మోహన్‌నే గుర్తిస్తారు. ఆయన విధానాల పర్యవసానంగా అంతవరకూ నిలువెల్లా ఆవరించిన నిర్ణయ రాహిత్యత కనుమరుగైంది. ఒక్కుమ్మడిగా ప్రైవేటు పెట్టుబడి రెక్కలు విప్పుకుంది. లాభార్జన మాత్రమే ధ్యేయంగా భావించే విదేశీ పెట్టుబడులు వెల్లు వెత్తాయి. పబ్లిక్ రంగ సంస్థలు సైతం పోటీలో దీటుగా నిలిస్తే తప్ప మనుగడ లేదని గ్రహించాయి.
‘చరిత్ర అయినా నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుందని ఆశిస్తాను’ అని ఒక సందర్భంలో అన్నారాయన. తనపై వచ్చిపడుతున్న విమర్శల జడికి ఆ హృదయం ఎంతగా తల్లడిల్లిందో చెప్పే మాట అది. నిజం... ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడైనా, పార్టీలోనూ వెలుపలా వచ్చిన అవాంతరాలను అధిగమించి దృఢంగా అమలు చేసినప్పుడైనా ఆయనకు శాపనార్థాలు ఎదుర య్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకులు తయారయ్యారు. తొలినాళ్లలోనే ఏదోరకంగా పక్కకు తప్పించాలన్న ప్రయత్నాలూ జరిగాయి.
మన రహస్యాలను ఐఎంఎఫ్‌కు చేరేస్తున్నారనీ, ఆ సంస్థ కనుసన్నల్లో విధానాలు రూపొందిస్తున్నారనీ ఎలాంటి ఆధారాలూ లేకుండానే కొందరు వండి వార్చారు. పార్లమెంటులో అలజడి ఖాయమనుకున్నారు. కానీ అప్పటికే మన్మోహన్ నిజాయితీ, నైతిక నిష్ఠ, నిష్కాపట్యత, సచ్ఛీలత అందరికీ అర్థమయ్యాయి గనుక అవన్నీ దూదిపింజñ ల్లా తేలిపోయాయి. వాటిని విపక్షం సభలో ప్రస్తావించినా పెద్దగా పట్టుబట్టలేదు. ఆ తర్వాత పీవీ సహచర మంత్రుల్లో కనీసం 20 మందిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మన్మోహన్‌ను వేలెత్తిచూపే సాహసం ఎవరూ చేయలేదు.
ఆ సుగుణాలే మన్మోహన్‌ను అనంతర కాలంలో ప్రధానిగా ఎంచుకునేందుకు దోహదపడ్డాయి. దేన్నయినా సాధించటంలో ఆయన పట్టుదల ఎంత టిదో చెప్పటానికి అమెరికాతో కుదిరిన అణు ఒప్పందమే ఉదాహరణ. మద్దతునిస్తున్న వామ పక్షాలూ, ఇతర పార్టీలూ ససేమిరా కాదన్నా ఆ ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచి ఆమోదింపజేసుకున్న సాహసి ఆయన.
మన్మోహన్ అత్యున్నత స్థాయి ఆర్థిక నిపుణుడు కావొచ్చు... ఆ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం విప్పిచెప్పిన అనేకానేక విశ్లేషణాత్మక గ్రంథాల రచయిత కావొచ్చు. కానీసిద్ధాంత రాద్ధాంతాల్లో కూరుకుపోకుండా కళ్లెదుటి వాస్తవాలను ఆచరణీయ దృక్పథంతో పరిశీలించి సరిగా స్పందించగల విశాల దృక్పథం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసినప్పుడు మొదట్లో దాన్ని ఇష్టపడకున్నా సాగు సంక్షోభాన్ని అధిగమించటానికి అది తోడ్పడిన తీరు గుర్తించాక మన్మోహన్ దాన్ని స్వాగతించిన తీరు మరువలేనిది.
ప్రజాజీవన రంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే విద్యాహక్కు చట్టం, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులకు కరువురోజుల్లో పని కల్పన కోసం ఉపాధి హామీ చట్టం వంటివి తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినా ఏనాడూ ఆయన కీర్తిప్రతిష్ఠలను ఆశించలేదు. తన విధానాలతో దేశాన్ని వైభవోజ్జ్వల శకానికి తీసుకెళ్లినా చివరివరకూ నిగర్విగా, వినమ్రుడిగా జీవించిన దార్శనికుడు మన్మోహన్‌ను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆ అసాధారణ, అపురూప విజ్ఞాన ఖనికి ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment