ప్రపంచ నేతల నివాళులు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జ్ఞాపకాలు ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసాధారణ నాయకత్వానికి నివాళులు అర్పించారు. ‘‘అసాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆర్థిక సంస్కరణల పట్ల. భారత ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు నిబద్ధత, అంకితభావం, అచంచలమైన చిత్తశుద్ధి ఉంది. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. తెలివైన వ్యక్తి. ఆలోచనాపరుడు. నిజాయితీపరుడు.
భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) మన్మోహన్ సింగ్ ప్రభావం మరిచిపోలేనిది. వృద్ధిని ప్రోత్సహించే, పేదరికాన్ని తగ్గించే, విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను అమలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా), సమాచార హక్కు చట్టం వంటి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. తన పదవీకాలంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు’’.
– అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
ఆయన అంకితభావాన్ని గుర్తుంచుకుంటాం : అమెరికా
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత ప్రజలకు అమెరికా ప్రగాఢ సంతాపం తెలిపింది. ‘‘అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారులేసిన గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ సింగ్ ఒకరు. గత రెండు దశాబ్దాల్లో మన దేశాలు కలిసి సాధించిన అనేక అంశాలకు ఆయన కృషి పునాది వేసింది. అమెరికా–భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలకు స్వదేశంలో మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారు. డాక్టర్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నాం. అమెరికా, భారత్‌లను మరింత దగ్గర చేయడానికి ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’అని అమెరికా ప్రకటించింది.
ఆయన పర్యటన మైలురాయి
‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి మాల్దీవుల ప్రజల తరపున సంతాపం తెలుపుతున్నా. 2011 నవంబరులో మాల్దీవుల్లో ఆయన చేసిన చారిత్రాత్మక పర్యటన మన ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అభివృద్ధి పట్ల డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఉన్న నిబద్ధత, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి, సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’
– డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మాల్దీవుల అధ్యక్షుడు
మన్మోహన్‌సింగ్ నాకు గురువు
‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నేను గురువుగా భావిస్తా. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆర్థిక అంశాలపై డాక్టర్ సింగ్ సలహాలు తీసుకున్నారు. 2013లో యూరోజోన్ క్రైసిస్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె డాక్టర్ సింగ్ సహాయం కోరారు’’
– జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
Comments
Please login to add a commentAdd a comment