శ్రీకృష్ణుడికి అటుకులు తీసుకొచ్చిన బాల్యమిత్రుడు కుచేలుడి కథ అందరికీ తెలిసిందే. అలాంటిదే డాక్టర్ మన్మోహన్‌సింగ్ (Manmohan Singh) జీవితంలోనూ జరిగింది. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న గాహ్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) అనే గ్రామంలో సింగ్ జన్మించారు. పాఠశాల చదువు అక్కడే పూర్తి చేశారు. 1947 విభజన తరువాత కుటుంబం భారత్‌కు వచ్చింది. కానీ ఆయన బాల్యమంతా ఆ గ్రామంతోనే ముడిపడి ఉంది. స్నేహితులు అక్కడే ఉండిపోయారు.
2004లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ వార్త స్వగ్రామానికి చేరకుండా ఉంటుందా? మిత్రులంతా ఆయనను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్‌సింగ్‌కు ప్రాణమిత్రుడైన రాజా మహమ్మద్ అలీకి చిన్ననాటి స్నేహితుడు మన్మోహన్‌ను కలవాలనిపించింది. ఆయన చిన్నతనంలో మన్మోహన్‌సింగ్‌ను అలాగే పిలిచేవారు. తన సామర్థ్యం మేరకు కానుకలను పట్టుకుని 2008 మే నెలలో ప్రధాని నివాసానికి వచ్చారు. తనను కలవడానికి వచ్చిన చిరకాల మిత్రుడు అలీకి మన్మోహన్ మరిచిపోలేని ఆతిథ్యమిచ్చారు.
అప్పుడు ఇద్దరిదీ డెబ్బై ఏళ్ల వయసు. కానీ బాల్య జ్ఞాపకాలతో ఇద్దరి కళ్లు మెరిసిపోయాయి. ఆ పూటంతా జ్ఞాపకాలతో గడిచిపోయింది. మిత్రుడికి తలపాగా, శాలువాతోపాటు టైటాన్ వాచ్‌ను తన గుర్తుగా ఇచ్చారు మన్మోహన్. ఇక అలీ తిరిగి వెళ్తూ.. మన్మోహన్‌కోసం తీసుకొచ్చిన ఊరి మట్టిని, నీటిని, గాహ్ ఫొటోను బహూకరించాడు. స్నేహంకోసం మట్టిని ఎల్లలు దాటించి ఒక మిత్రుడు తీసుకొస్తే.. సరిహద్దులు ఎన్నున్నా స్నేహం ఎల్లకాలం ఉంటుందనడానికి గుర్తుగా గడియారాలను పంపారు. అలా బాల్యమిత్రులు ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment