
అత్తెసరు ఆదాయమే అందుకు కారణం
భారత్‌లో 10 శాతం మంది దగ్గరే 57.7 శాతం సంపద
50 ఏళ్ల కనిష్టానికి మధ్యతరగతి వర్గం పొదుపు
వారిలో సగం మందికి పదేళ్లుగా వేతన పెంపే లేదు
అనూహ్యంగా విస్తరిస్తున్న అసమానతలు: బ్లూమ్ వెంచర్స్
ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో వినియోగదారుల వర్గం పెరగడం లేదు. సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతోంది. ఏకంగా 100 కోట్ల మంది వద్ద వస్తువులు, సేవల మీద వెచ్చించేందుకు డబ్బు లేదు! బ్లూమ్ వెంచర్స్ సంస్థ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 143 కోట్ల జనాభాలో అత్యవసరం కాని వస్తువులు, సేవలపై, అంటే ఓ మాదిరి విలాసాలపై ఖర్చు చేసే ప్రజల సంఖ్య చాలా తక్కువని తెలిపింది. వెంచర్ క్యాపిటల్ నివేదిక ప్రకారం దేశంలో 13 నుంచి 14 కోట్ల మందే ‘వినియోగ వర్గం’గా ఉన్నారు. కనీసావసరాలకు మించి కొనుగోలు చేయగల సామర్థ్యం వీరికే ఉంది.
ఈ వినియోగదారుల వ్యయంపైనే దేశ జీడీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంతో ఎక్కువ వెచ్చిస్తున్నా చాలావరకు అది అత్యవసర సేవల కోసమే ఉంటోందని తెలిపింది. కొత్త స్టార్టప్‌ల సేవలకు వారు డబ్బు వినియోగించడం లేదని తెలిపింది. భారత్‌లో వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా విస్తరించడం లేదని, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఉన్నవారే మరింత సంపన్నుల వుతున్నా రని ఈ సర్వే మరోసారి తేల్చిందని నిపుణులంటున్నారు. ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.
మధ్యతరగతిపై రోకటిపోటు1990లో జాతీయాదాయంలో 34 శాతంగా ఉన్న భారతీయ సంపన్నుల వాటా ఇప్పుడు ఏకంగా 57.7 శాతానికి పెరిగింది. దిగువ సగం జనాభా వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. ఆర్థిక పొదుపు కూడా క్షీణిస్తోంది. మెజారిటీ భారతీయుల రుణాలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న వినియోగదారులు కొనుగోళ్ల కోసం దాదాపుగా రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరక్షిత రుణాల నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేయడం వారిని బాగా ప్రభావితం చేస్తోంది.
వినియోగదారుల డిమాండ్‌కు ప్రధాన చోదకశక్తిగా ఉన్న మధ్యతరగతి కుంచించుకుపోతోంది. దేశంలో పన్ను చెల్లించే మధ్య తరగతిలో సగం మందికి దశాబ్దం కాలంగా వేతనాల్లో పెరుగుదల లేదు. పైపెచ్చు ద్రవ్యోల్బణంతో పోలిస్తే వారి ఆదాయాలు సగానికి పడిపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం మధ్యతరగతి పొదుపును దాదాపుగా నాశనం చేసేసింది. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి చేరిందని ఆర్బీఐ పదేపదే చెబుతోంది. దాంతో మధ్యతరగతి గృహ వ్యయాలతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలకు మున్ముందు గడ్డుకాలమేనని నివేదిక సూచిస్తోంది.
ఏఐ దెబ్బ...
సాంకేతికత, యాంత్రీకరణ దెబ్బకు వైట్ కాలర్ ఉద్యోగాలు శరవేగంగా మాయమవుతున్నట్టు మార్సెలస్ నివేదిక హెచ్చరిస్తోంది. క్లరికల్, సెక్రటేరియల్ పోస్టులను క్రమంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు భర్తీ చేస్తున్నాయి. దాంతో తయారీ రంగంలో పర్యవేక్షక ఉద్యోగాలూ తగ్గుతున్నాయి. ఏఐ తాలూకు ఈ దుష్ప్రభావం గురించి ఆర్థిక సర్వే–2025 కూడా పేర్కొంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నా కార్మికులపై ఆధారపడే మన ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బ తీస్తుందని హెచ్చరించింది. వృద్ధిని కూడా ఇది దెబ్బ తీస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యా సంస్థల మధ్య సహకారం, సమగ్ర విధానం అవసరమని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం విషయంలో అలసత్వం చూపితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment