మన్మోహన్ వద్ద మోదీ పాఠాలు
ఆర్థికవృద్ధి ఎలా సాధించాలని అడుగుతున్నారు: రాహుల్
అందరి అభిప్రాయాలు వినడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది
ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణ సాకుతో వ్యక్తిత్వాన్ని హత్య చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వద్ద అర్థశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నారని, దేశ ఆర్థికవృద్ధి సాధించడం ఎలా అని అడిగి తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. వ్యక్తిత్వాన్ని హత్య చేయటం ఆర్‌ఎస్‌ఎస్ విశ్వాసమని, ఆ ఆలోచనా విధానమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోందని.. రైతుల నుంచి దుస్తుల వరకూ అంతా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి తెలుసుననే భావన రాజ్యమేలుతోందని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఆర్థికవ్యవస్థ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ నిన్న (బుధవారం) ఉద యం విమర్శలు చేస్తే.. సాయంత్రం ఆయన నుంచి మోదీ ఆర్థశాస్త్ర పాఠాలు చెప్పించుకున్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటం ఎలా అని అడిగి తెలుసుకున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జాతీయ సదస్సు ‘దృష్టికోణ్’లో రాహుల్ గురువారం ప్రసంగిస్తూ.. మోదీ సర్కారు పైన, అధికార బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆర్‌ఎస్‌ఎస్ పైన పదునైన విమర్శలు చేశారు. ‘‘గతంలో నాకు అర్థమయ్యేది కాదు. సభలో అటు వైపు నుంచి, ఇటు వైపు నుంచి రకరకాల అభిప్రాయాలు వినపడుతుండేవి.
ఇదేంటి క్రమశిక్షణ తగ్గుతుందేమో అనుకునేవాడిని. కానీ అందరి వాణి వినడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని తరువాత నాకు అర్థమైంది. అన్ని వర్గాల అభిప్రాయాలను వినడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఇమిడిఉంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి, అంతర్గత చర్చకు అవకాశం ఉందని, అంతిమంగా అది ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి దారితీస్తుందని అర్థమైంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ను చూడండి. ఆ ఆర్‌ఎస్‌ఎస్ శాఖను చూడండి. ఒక గీత గీస్తారు. ఆ గీత దాటితే లాఠీదెబ్బ పడుతుంది. వ్యక్తిత్వాన్ని హత్య చేసేందుకు క్రమశిక్షణను వారు సాకుగా చేసుకున్నారు. అదే భావజాలంతో ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దే శాన్ని నడిపిస్తున్నాయి’’ అని విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న అవసరాలు, విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. వాటిన్నంటినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీలో అలా కాదు. విద్య గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం.
బట్టల గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. రైతుల గురించి అయినా ఒక్కరే మాట్లాడతారు. ఎవరూ మాట్లాడకూడదు.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్రమోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అమెరికా వెళ్లారు. మంగోలియా, చైనా వెళ్లారు. కానీ రైతులు, కూలీల ఇంటికి మాత్రం వెళ్లలేకపోయారు’’ అని విమర్శించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ శాఖలో ఎవరూ మాట్లాడకూడదు. అలాగే దేశంలో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు. దేశంలో విద్యారంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఆర్‌ఎస్‌ఎస్ తన ఆలోచనా ప్రక్రియను రుద్దుతున్న విద్యా సంస్థల్లో ఆ సంస్థతో పోరాడాలి’’ అని ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు.