మన్మోహన్‌లా మోదీ డమ్మీ కాదు: కేంద్ర మంత్రి రాథోడ్
హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లా ప్రధాని నరేంద్ర మోదీ డమ్మీ కాదని కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరించారు. కేంద్ర మంత్రులను కాంగ్రెస్ డమ్మీ అనడాన్ని తిప్పికొడుతూ.. యూపీఏ హయాంలో ప్రధానినే డమ్మీ అనేవారని, ఇప్పుడు కాంగ్రెస్ వ్యాఖ్యలను బట్టి ప్రస్తుత ప్రధాని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అంగీకరించారని ఎద్దేవా చేశారు. అయితే మోదీ ఏకపక్షంగా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోకుండా మంత్రులందరితో చర్చించాకే ముందుకు సాగుతున్నారని వివరించారు.
తమ మంత్రివర్గం టీమ్ ఇండియాలా పనిచేస్తోందన్నారు. ఏడాదిలోనే 60 ఏళ్ల పనులు చేయలేమని, అయినా గణనీయమైన మార్పులను తీసుకొచ్చామని రాథోడ్ చెప్పారు. కుంభకోణాలు, అవినీతిని రూపుమాపామన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను పెద్దన్నలా చూస్తున్నాయన్నారు. కోట్లాది బ్యాంకు ఖాతాలు తెరవడం, అందరికీ బీమా సౌకర్యం కల్పించడం తమ ఘనతగా చెప్పారు. యూపీఏ పథకాలను ఎన్డీయే కాపీ కొట్టిందనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.