యాక్సిడెంటల్ పీఎం. ఈ పదబంధం డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు అచ్చు గుద్దినట్టుగా సరిపోతుంది. నిజానికి ఆయనకున్న భుజకీర్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త. అనుకోకుండా వచ్చి పడ్డ ముళ్లకిరీటం వంటి ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిభాయించి దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావి. ఏకంగా పదేళ్లపాటు ప్రధాని. ఆ ఘనత సాధించిన తొలి సిక్కు.
నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడు. సమాచార హక్కు వంటి కీలక చట్టాలు చేసిన సర్కారుకు సారథి. అయినా సరే, మన్మోహన్ పేరు చెప్పగానే ఎవరికైనా మదిలో మెదులేది ఆయన అనూహ్యంగా ప్రధాని అయిన తీరే! అందుకే ఆయనపై రాసిన పుస్తకానికి ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సంజయ బారు కూడా ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పేరు పెట్టారు. ‘పీఎం మన్మోహన్’కు మీడియా సలహాదారుగా నాలుగేళ్ల పాటు ఆయనను అతి దగ్గరగా చూసిన అనుభవాలన్నింటినీ అందులో నిర్మొహమాటంగా పొందుపరిచారు.
నిశ్శబ్ద సంస్కర్త
ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పరుగులు పెట్టింది. మన దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చరిత్రాత్మక చట్టాలు పుట్టుకొచ్చాయి. వామపక్షాలు వ్యతిరేకించినా, ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా వెరవక అమెరికాతో మన్మోహన్ కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం మరో మైలురాయి. దౌత్య రంగంలో కూడా పలు
విజయాలకు ఆయన హయాం వేదికైంది. అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలతో బంధాలను బలోపేతం చేశారు. ఫలితంగా 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నా మన్మోహన్ ముందుచూపు నిర్ణయాల వల్ల భారత ప్రస్థానం మాత్రం స్థిరంగా సాగింది. ఇన్ని చేసినా కృషికి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే మిగిలిపోయారు మన్మోహన్.
మీరు జోక్ చేస్తున్నారా?
ఆర్థిక శాఖ ఆఫర్‌పై మన్మోహన్
అది 1991. కేంద్రంలో పీవీ సారథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. మర్నాడే ప్రమాణస్వీకారం. మంత్రివర్గ కూర్పుపై పీవీ మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ సమయాన మన్మోహన్ ఢిల్లీలో తన నివాసంలో కూర్చుని తాపీగా పేపర్ చదువుతున్నారు. అప్పుడు పీవీ ముఖ్య కార్యదర్శి ఆయన ఇంటికి వచ్చారు. ‘ప్రధాని మిమ్మల్ని కేబినెట్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. దాన్ని మన్మోహన్ నమ్మలేదు. ‘‘నేనా? కేబినెట్‌లోకా? మీరు జోక్ చేస్తున్నారా?’’ అంటూ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
మర్నాడు ప్రమాణ స్వీకారానికి వేళవుతున్నా మన్మోహన్‌న్‌రాష్ట్రపతి భవన్ చేరుకోకపోవడంతో పీవీ ముఖ్య కార్యదర్శి నేరుగా ఆయన ఇంటికి ఫోన్‌చేశారు. ’ప్రమాణానికి టైం దగ్గర పడుతుంటే మీరింకా రాలేదేంటి?’ అంటూ హైరానా పడ్డారు. అప్పటికి గానీ తాను నిజంగానే మంత్రిని కాబోతున్నట్టు మన్మోహన్ నమ్మలేదు. దాంతో ఉన్నపళాన బయల్దేరి వెళ్లి ప్రమాణస్వీకారం చేశారు. ‘‘అలా నా రాజకీయ జీవితం హడావుడిగా మొదలైంది! కనీసం తయారయ్యే టైం కూడా లేకుండానే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది’’ అంటూ 2005లో ఓ బ్రిటిష్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్మోహన్ గుర్తు చేసుకున్నారు.
అవార్డులు.. రివార్డులు
ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి మన్మోహన్ లెక్కలేనన్ని గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. 1987లో దేశ రెండో అతి పెద్ద పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఎన్నో దేశాలు ఆయనకు తమ అత్యుత్తమ పౌర పురస్కారాలు ప్రదానం చేశాయి.
కష్టాల బాల్యం
మన్మోహన్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని గహ్ గ్రామంలో జని్మంచారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్నీ తానై పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్‌సర్ వలస వచ్చింది. ఆర్థిక కష్టనష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్‌షిప్‌లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో నఫీల్డ్ కాలేజీలో పీహెచ్‌డీ చేశారు. ఆయన సమరి్పంచిన డాక్టోరల్ థీసిస్ ‘భారత ఎగుమతి ధోరణులు, స్వయం ఆధారిత వృద్ధి ప్రాతిపదికలు’ మన ఆర్థిక వ్యవస్థపై ఆయన లోతైన దృష్టికి తార్కాణం.
అధ్యాపకునిగా, బ్యూరోక్రాట్‌గా...
మన్మోహన్ కెరీర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్‌గా మొదలైంది. పంజాబ్ యూనివర్సిటీ ,ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బోధించారు. ఆర్థికశాస్త్రం, విధానాలపై లోతైన అవగాహన ఆయనది. 1966–69 మధ్య ఐరాసలోనూ పని చేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్‌గా మారారు. తొలుత వాణిజ్య, పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా చేశారు. అనంతరం 1972–1976 నడుమ కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగావున్నారు. 1982–1985 మధ్య రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రాణించారు. తర్వాత రెండేళ్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరణ బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి.
మచ్చలేని వ్యక్తిత్వం
నిజాయితీకి, మచ్చలేని వ్యక్తిత్వానికి ప్రతీక మన్మోహన్. ప్రజా జీవితంలో నాయకులు పాటించాల్సిన విలువలకు బెంచ్‌మార్క్‌గా నిలిచారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అతి నిరాడంబర జీవన శైలి, అన్ని అంశాల మీదా లోతైన అవగాహన సమకాలీన నాయకుల్లో ఆయన్ను అత్యంత విలక్షణంగా నిలిపాయి. నెహ్రూను కూడా కాదని మన్మోహన్‌ను అత్యుత్తమ ప్రధానిగా కుష్వంత్‌సింగ్ వంటి ప్రముఖులు కీర్తించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రచారం నిమిత్తం తన వద్ద తీసుకున్న రూ.2 లక్షలను మన్మోహన్ గుర్తుతో తిరిగిచ్చిన వైనాన్ని కుష్వంత్ చాలాకాలం పాటు ఎందరితోనో చెప్పుకున్నారు.
పాలనపై విమర్శ...
వ్యక్తిగతంగా మన్మోహన్‌ది ఏ మచ్చా లేని జీవితమే అయినా పాలనపరంగా మాత్రం కొన్ని విమర్శలూ ఎదుర్కొన్నారు. యూపీఏ–2లో రెండోసారి ప్రధాని అయ్యాక కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి కుంభకోణాలు ఆయన ప్రతిష్టను మసకబార్చాయి. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నల పరంపరకు, ‘వెయ్యి సమాధానాల కంటే మౌనమే మేలు’ అంటూ ఆయన బదులిచ్చారు. అవినీతి, నమ్మకద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై బదులిచ్చేందుకు కోర్టుకు రావాల్సిందిగా అనంతర కాలంలో సమన్లు కూడా అందుకోవాల్సి వచ్చింది.
ఆ మలుపు...
1991లో మన్మోహన్ జీవితం అనుహ్యమైన మలుపు తిరిగింది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయమది. విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని మన్మోహన్‌ను ఎకాయెకిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. దీనిపై అప్పట్లో పలువురు పెదవి విరిచినా ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్‌గా నిలిచింది.
మన్మోహన్ విధానాలు, 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపా యిని విలువ తగ్గించినా, విదేశీ పెట్టుబడులకు బాటలు పరిచినా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినా అన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నిర్ణయాలే! పీవీ మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేలచూపులు చూస్తున్న మన ఆర్థిక వ్యవస్థ సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ‘ఏ శక్తీ ఆపలేని ఆలోచనలు మనవి’ అంటూ 1991 బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అనంతర చరిత్ర నిరూపించింది.
ప్రధానిగా ప్రస్థానం
మన్మోహన్ జీవితంలో 1991ని కూడా మించిన అత్యంత అనూహ్య మలుపుకు 2004 వేదికైంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ మెజారిటీ సాధించినా సోనియాగాంధీ ప్రధాని కావడంపై అభ్యంతరాలు తలెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమె విదేశీయతను ప్రశ్నించిన పరిస్థితి! దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవిని సోనియా ‘త్యాగం’ చేశారు. ప్రణబ్ సహా కాంగ్రెస్ దిగ్గజాలెందరో ఆ పదవికి పోటీ పడ్డా సోనియా మాత్రంసౌమ్యుడైన మన్మోహన్‌కేసి మొగ్గారు. అలా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, ఆ అత్యున్నత పదవిలో ఏకంగా పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగి ఆయన మరో చరిత్ర సృష్టించారు!
రాహుల్ చించేసిన ఆ ఆర్డినెన్స్...
ప్రధానిగా తన పాలనా కాలం పొడవునా సోనియా నీడలోనే మిగిలిపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు మన్మోహన్. జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్ హోదాలో పదేళ్ల పాటు ఆమె బాధ్యత లేని అధికారాలు చలాయించినా చేష్టలుడిగి చూశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2013లో సోనియా తనయుడు రాహుల్‌గాంధీ చేసిన పని మన్మోహన్ గౌరవ ప్రతిష్టలను మరింత దిగజార్చింది. కళంకిత నేతలు దోషులుగా తేలినా మూడు నెలల పాటు పదవుల్లో కొనసాగవచ్చంటూ 2013లో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ‘నాన్సెన్స్’ అంటూ రాహుల్ కొట్టిపారేశారు.
అంతటితో ఆగకుండా విలేకరుల సమావేశం సాక్షిగా ఆర్డినెన్స్ కాపీని చించేశారు. అది మన్మోహన్‌ను కూడా తీవ్రంగా కలచివేసిందని చెబుతారు. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాబోలు, మన్మోహన్‌ను ‘దేశ చరిత్రలోనే అత్యంత బలహీన ప్రధాని’గా బీజేపీ దిగ్గజం ఎల్‌కే ఆడ్వాణీ, ‘నైట్ వాచ్‌మన్’గా, ‘గాంధీల చేతుల్లో కీలు»ొమ్మ’గా నరేంద్ర మోదీ అభిర్ణించారు! మన్మోహన్ తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నికవలేదు! ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం 2024 ఏప్రిల్‌తో రాజ్యసభ సభ్యుని హోదాలో ముగిసింది.
‘మన్మోహనాలు’
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వివిధ అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో పంచుకున్న మనసులోని భావాలు.
ఆర్థిక సంస్కరణలపై..
→ సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదు.
గ్లోబలైజేషన్, ఆర్థిక వ్యవస్థపై:
→ భారత్ ఇప్పుడు సమ్మిళిత, సమాన, స్థిరమైన వృద్ధి పథంలో సాగుతోందని నేను నమ్ముతున్నా
→ ప్రపంచీకరణ ఒక వాస్తవం. దాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా మన విధానాలను రూపొందించుకోవాలి.
నాయకత్వం, పాలనపై..
→ భారత్‌కు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని నిజంగా విశ్వసిస్తున్నా. వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేందుకు సుపరిపాలన అవసరం.
ప్రపంచంలో భారతదేశం పాత్రపై
→ భారత్ పురాతన దేశమే అయినప్పటికీ అది యువదేశం. ఎటుచూసినా యువతరం కనిపిస్తున్న మాదిరిగానే మనం ఆత్రుతలో ఉన్నాం. కానీ భవిష్యత్తు మనదే అని నేను బలంగా నమ్ముతున్నా.
→ మనం ఎదురుదాడి కాకుండా సహకారం, పోటీతత్వం అనే సరైన మార్గాన్ని ఎంచుకుంటే భారత్ ఎదిగేందుకు ఈ ప్రపంచం చోటు కల్పిస్తుంది.
ఆయనపై
→ పెద్ద బాధ్యత అందుకున్న చిన్న వ్యక్తిని నేను.
ప్రధానిగా..
→ వినయం, లక్ష్యానికితగ్గ పట్టుదల నాయకత్వానికి పునాదులని నేను ఎల్లప్పుడూ విశ్వసించా.
విద్య, యువతపై..
→ భవిష్యత్తుకు విద్యే కీలకం. దేశ ప్రజలు, భవిత కోసం దేశం చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అదే.
→ దేశ యువత గొప్ప కలలు కనాలి. గొప్ప కలలు కంటేనే మనం గొప్ప విజయాలను సాధించగలమని నమ్మొచ్చు.
చరిత్ర ఉదారంగానే చూస్తుంది...
సమకాలీన మీడియా కంటే చరిత్ర నా పట్ల ఉదారంగానే వ్యవహరిస్తుంది
– 2014 జనవరిలో ప్రధానిగా చివరి మీడియా సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలివి! మీడియా శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో అలా స్పందించారాయన. ‘సంకీర్ణ రాజకీయాల అనివార్యతకు లోబడి నేను చేయగలిగినంత చేశాను. దానిపై చరిత్రే తుది తీర్పరి’ అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment