జీఎస్టీపై సహకరించండి
కాంగ్రెస్‌కు ప్రభుత్వం వినతి
* సోనియా, మన్మోహన్‌లతో భేటీ అయిన వెంకయ్య
* హామీ ఇవ్వని సోనియా.. పార్టీలో చర్చించి చెప్తామని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి కాంగ్రెస్ గడప తొక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌లతో గురువారం భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లుల ఆమోదానికి సహకరించాలని.. కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్లయితే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సాధారణ షెడ్యూలు కంటే ముందస్తుగా జరపడానికి ప్రభుత్వ సన్నద్ధతను సోనియాకు వెంకయ్య వివరించారు.
గత నవంబర్ 27న ప్రధానమంత్రి నివాసంలో మోదీతో సోనియా, మన్మోహన్‌ల భేటీ తర్వాత ప్రభుత్వం తరపున కాంగ్రెస్‌తో అధికారికంగా జరిగిన భేటీ ఇదే. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన చర్చల అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీతో పాటు ఇతర కీలక బిల్లులపై కాంగ్రెస్ తుది వైఖరిని స్పష్టం చేయాలని కోరినట్లు తెలిపారు. బిల్లుపై కాంగ్రెస్ లేవనెత్తిన వివిధ అంశాలపై జైట్లీ ఇప్పటికే సమాధానాలిచ్చారని కాగ్రెస్ నాయకత్వానికి తెలియజేసినట్లు వివరించారు.
రియల్ ఎస్టేట్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించిందని,అందువల్ల ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించేలా సహకరించాలని వెంకయ్య కోరారు. తమ పార్టీలో అంతర్గతంగా చర్చించి చెబుతామని సోనియా గాంధీ తమతో చెప్పారని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్, ఉపనేత ఆనందశర్మలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేస్తే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి సోనియా లేదా రాహుల్‌గాంధీలను మరోసారి కలవటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు.
లిఖితపూర్వకంగా జవాబివ్వండి: కాంగ్రెస్
ప్రభుత్వం ఆశలపై నీళ్లు చల్లుతూ కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ బిల్లుపై తమ విధానాన్ని పునరుద్ఘాటించింది. జీఎస్టీ బిల్లుకు తాము వ్యతిరేకం కాదంటూనే, ఈ బిల్లుపై తాము లేవదీసిన అంశాలపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక జవాబు కోసం ఎదురుచూస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కపిల్ సిబల్ స్పష్టం చేసారు.ఈ బిల్లుకు ఆమోదం పొందే విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని కపిల్ సిబల్ ఆరోపించారు. ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ లేవదీసిన అంశాలపై సంప్రదింపులు జరపాలని సిబల్ అన్నారు.
జీఎస్టీ బిల్లును గత యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో ఈ బిల్లును మోడీ వ్యతిరేకించారని సిబల్ చెప్పారు. అంతేకాకుండా రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణిస్తోందని, అందువల్ల జీఎస్టీ బిల్లుకు త్వరలో పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జేట్లీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వాస్తవానికి స్వదేశీ జాగరణ్ మంచ్, ఆర్‌ఎస్‌స్‌లు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, ఆర్ధిక మంత్రి కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని సిబల్ చెప్పారు.