సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే.
16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు.
17న నియోజకవర్గాల్లో బస
ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు.
సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా..
- హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు.
- రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు.
- గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment