సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కదన రంగంవైపు కాంగ్రెస్ మరో ముందడుగు వేసింది. తుక్కుగూడ సభ వేదికగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఇటు సెంటిమెంట్ అస్త్రాన్ని, అటు గ్యారంటీ పథకాల మంత్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఆ దిశగా సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని ప్రజల్లోకి వెళ్లేలా.. సోనియా, ఇతర నేతలు ప్రసంగించారు. ఇదే సమయంలో రైతులు, మహిళలు, పేదలు.. ఇలా అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేలా ఆరు గ్యారంటీల పేరిట కీలక హామీలను ప్రకటించారు. మరోవైపు బీజేపీతోపాటు బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలను టార్గెట్ చేస్తూ అగ్రనేతలు విమర్శలు గుప్పించడం గమనార్హం.
కల నెరవేర్చామంటూ..
విజయభేరి సభలో సోనియా కొంతసేపే మాట్లాడినా.. ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. తెలంగాణ ఏర్పాటులో తనతోపాటు కాంగ్రెస్ సహచరులు పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది తన కల అన్నారు. తెలంగాణ తన చొరవతోనే వచ్చిందని చెప్తూనే.. ప్రజల కల నెరవేర్చినందుకు బదులుగా అధికారాన్ని ఇచ్చి తన కల నెరవేర్చాలనేలా సోనియా ప్రసంగం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
రాహుల్ గాంధీ కూడా తాము తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని గుర్తుచేస్తూ.. తమను గెలిపిస్తే ఇప్పుడు ఇస్తున్న హామీలన్నీ నెరవేరుస్తామని ప్రకటించడం గమనార్హం. ఇక సోనియాతోనే మహిళలకు గ్యారంటీ ఇప్పించడం ద్వారా వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేశారని అంటున్నాయి. మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 నగదు సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను సోనియా గాంధీనే ప్రకటించారు. ఈ హామీలు మహిళల ఓట్లను రాబడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక రైతులు, యువకులు, వృద్ధులు, పేదల కోసం మరో ఐదు గ్యారంటీలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఇవి ఆయా వర్గాలను ఆకర్షిస్తాయని భావిస్తోంది.
మూడు పార్టీలను టార్గెట్ చేస్తూ..
అటు సీడబ్ల్యూసీ సమావేశాల్లో, ఇటు తుక్కుగూడ బహిరంగసభలో రెండు అంశాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని, అవసరమైనప్పుడు ఆ మూడు పార్టీలు సహకరించుకుంటాయని కాంగ్రెస్ నేతలు పదేపదే పేర్కొన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడినప్పుడు.. సభ వేదికపై రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడినప్పుడు ఈ మూడు పార్టీలపై విమర్శలు గుప్పించారు.
పార్టీ కేడర్‌లో జోష్
సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ, తుక్కుగూడలో భారీ బహిరంగసభతో రెండు రోజుల పాటు జరిగిన హడావుడి రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తుక్కుగూడ సభకు భారీ జనసందోహం రావడంతో కాంగ్రెస్ కేడర్‌లో నెలకొన్న జోష్‌కు నిదర్శమని.. సోనియాగాంధీ పాల్గొన్న ఈ సభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment