కేంద్రం కొనియాడిన పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు
రూ.1,384 కోట్ల ప్రీమియం చెల్లింపునకు విముఖత
అధ్యయనం పేరిట సబ్ కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ఈ పథకాన్ని కొనసాగించాలంటున్న రైతులు, రైతు సంఘాలు
పాత పద్ధతినే అమలు చేస్తే ఆందోళనలకు సిద్ధం
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు మంగళం పాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంటల బీమాపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశం కాబోతోంది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పంటల బీమాపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
ఐదేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేస్తున్నట్టుగా తొలి సమీక్షలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం రైతుల భాగస్వామ్యంతో అమలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) తీసుకొస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు.
ఈ ప్రకటనకు కొనసాగింపుగా ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మెరుగైన బీమా పథకం కోసం అధ్యయనం పేరిట వ్యవసాయ, పౌర సరఫరాలు, ఆర్థిక శాఖా మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న క్రాప్ ఇన్సూ్యరెన్స్ చట్టాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్‌లో తీర్మానించారు. పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఆ తర్వాత ఒక్కొక్కొటిగా వాటికి మంగళం పాడుతోంది.
అత్యుత్తమ పథకంగా కొనియాడిన కేంద్రం
ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే ది బెస్ట్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పథకమని కేంద్రమే అధికారికంగా ప్రకటించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద 2023లో అవార్డును సైతం అందించింది. ఏపీ స్ఫూర్తితో నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజి కల్పించేందుకు ఫసల్ బీమాలో పలు మార్పులు కూడా చేసింది.
ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజి కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా 2019 రబీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది.
రూ.7802 కోట్ల పరిహారం
ఈ పథకం కింద రికార్డు స్థాయిలో దాదాపు 5 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించడం ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు ఉచితంగా బీమా రక్షణ కల్పించింది. ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7802.08 కోట్ల బీమా పరిహారం నేరుగా జమ చేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో కలిపి ప్రీమియం రూపంలో రూ.1,384 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఈ బకాయిలు చెల్లించ కుండా ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో పాత పంటల బీమాను పునరుద్దరిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ కానుంది. పైసా భారం పడకుండా ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలంటూ రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment