
విజయవాడ: ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టోపీ పెట్టే క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్ జలీల్ ఖాన్ ల మధ్య పంచాయితీ జరిగింది. చంద్రబాబుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మొదట టోపీ పెట్టగా, దాన్ని జలీల్ ఖాన్ తీసేసి ఆ స్థానంలో తాను తెచ్చిన టోపీని పెట్టారు. తాను పెట్టిన టోపీని తీయడమేంటని ఆగ్రహించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్.. జలీల్ ఖాన్ పెట్టిన టోపీని కూడా తీసేయబోయారు. దాన్ని జలీల్ ఖాన్ అడ్డగించారు. తాను పెట్టిన టోపీని తీయడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేని అడ్డుకున్న జలీల్ ఖాన్.. ఎమ్మెల్యే చేయిన పక్కకు తోసేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కనిపించింది.

ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణ
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు.
సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు