చిన్నచిన్న విషయాల పట్ల స్పందనే మనుషుల వ్యక్తిత్వమేంటో తెలిసేలా చేస్తుంది. కొంతకాలంగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన సమావేశాలు, ఇంటర్వ్యూలను సిబ్బంది వాయిదా వేస్తున్నారు. అంతటి అనారోగ్యంలోనూ ఆయన ఈ–మెయిల్‌లకు సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూ కావాలని అడిగిన ఓ విలేకరికి.. ‘అనారోగ్యం కారణంగా నేను ప్రస్తుతానికి ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతున్నా. అందుకు చింతిస్తున్నా’అని రిప్లై ఇచ్చారు. ఆ ప్రస్తుతానికి అనే మాట ఎప్పటికిలా మిగిలిపోయింది.
విస్పష్ట స్పందన...
బాధ్యతల్లో ఉన్నప్పుడు ఓకే.. ఏ బాధ్యతల్లో లేకపోయినా.. అంతగా సహకరించని వయసులో దేశం గురించి ఆందోళన చెందే వ్యక్తులు చాలా అరుదు. అలాంటి అరుదైన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. గతేడాది జీ20 సదస్సు మన దేశంలో నిర్వహించారు. సదస్సు జరగడానికి ముందే ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్‌లోని నేతలంతా అదో షోగా ఎగతాళి చేసినా.. ఆయన మాత్రం సదస్సు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కొత్త ప్రపంచ క్రమాన్ని నడిపించడంలో దేశం కీలకపాత్ర పోషిస్తోందని, అలాగే తన సార్వభౌమ, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇస్తూ సరైన పనిచేస్తోందని కొనియాడారు. దేశ భవిష్యత్ గురించి ఆశావాహంగా ఉన్నానని చెప్పిన ఆయన.. భారత సమాజం సామరస్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుందంటూ బీజేపీకి చురకలంటించారు.
సిగ్గుపడుతూనే కేక్ కట్ చేసి..
వ్యక్తిగత వేడుకలను అంతగా ఇష్టపడని వ్యక్తి మన్మోహన్‌సింగ్. 2011లో ఐక్యరాజ్యసమితి సమావేశాల అనంతరం న్యూయార్క్ నుంచి ఇండియా వస్తున్నారు. అది కూడా ఆయన జన్మదినమైన సెపె్టంబర్ 26న. దీంతో ఎయిర్ ఇండియా వన్ విమాన సిబ్బంది కేక్ కట్ చేయించాలని ప్లాన్ చేసింది. మన్మోహన్‌కు షుగర్ ఉండటంతో షుగర్ ఫ్రీ కేక్‌ను విమానంలో సిద్ధంగా ఉంచారు. విమానంలో వేడుకలకు ఆయన మర్యాదగా నో చెప్పారు. టేకాఫ్ అయిన తరువాత, పాత్రికేయులను పలకరించడానికి మీడియా విభాగానికి వచ్చినప్పుడు జర్నలిస్టులు అభ్యరి్థంచడంతో ఆయన సిగ్గుపడుతూనే అంగీకరించారు. అందరికీ కేక్ ముక్కలను అందించారు.
కుమార్తె కోసం ఒక్కరోజు..
పదేళ్ల పదవీకాలంలో కార్యాలయంలో అందరూ మన్మోహన్‌సింగ్‌ను ‘డాక్టర్ సాహెబ్’అని పిలుచుకునేవారు. సుదీర్ఘ విదేశీ పర్యటనలు అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయన అమెరికా అధికారిక పర్యటనలో ఉన్నప్పుడైనా, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్లినా ఒక రోజు మాత్రమే
పర్యటనను పొడిగించేవారు. ఆ ఒక్కరోజూ న్యూయార్క్‌లో అటార్నిగా పనిచేస్తున్న తన కుమార్తె అమృత్‌తో గడిపేవారు.
యాక్సిడెంటల్ ప్రధాని అంటూ పుస్తకమేసినా..
2014లో ఆయన పదవినుంచి దిగిపోయాక.. ప్రధాని నివాసాన్ని ఖాళీ చేస్తున్న సమయం. ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’అనే పుస్తకాన్ని ప్రచురించారు. మీడియానో, ప్రతిపక్షాలో కాదు.. తన సేవను చరిత్ర గుర్తిస్తుందని చెప్పిన మన్మోహన్ అన్నింటికీ దూరంగా తన పుస్తకాలను సర్దుకునే పనిలో పడ్డారు. ఆ సందర్భంలో ఆయన పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్‌ను మీడియా కలవగా.. ‘ఆ పుస్తకం నా తండ్రి నమ్మకానికి చేసిన ద్రోహం. ఆయన వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆయన ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేరని.. తన వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న పుస్తకాలను కొత్త ఇంట్లోకి మార్చడంపైనే దృష్టి పెట్టారని.. విమర్శలను ప్టటించుకోని మన్మోహన్ వ్యక్తిత్వం గురించి ఉపిందర్ చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment