Modest
-
వినయపూర్వక సమాధానం..
చిన్నచిన్న విషయాల పట్ల స్పందనే మనుషుల వ్యక్తిత్వమేంటో తెలిసేలా చేస్తుంది. కొంతకాలంగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన సమావేశాలు, ఇంటర్వ్యూలను సిబ్బంది వాయిదా వేస్తున్నారు. అంతటి అనారోగ్యంలోనూ ఆయన ఈ–మెయిల్‌లకు సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూ కావాలని అడిగిన ఓ విలేకరికి.. ‘అనారోగ్యం కారణంగా నేను ప్రస్తుతానికి ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతున్నా. అందుకు చింతిస్తున్నా’అని రిప్లై ఇచ్చారు. ఆ ప్రస్తుతానికి అనే మాట ఎప్పటికిలా మిగిలిపోయింది. విస్పష్ట స్పందన... బాధ్యతల్లో ఉన్నప్పుడు ఓకే.. ఏ బాధ్యతల్లో లేకపోయినా.. అంతగా సహకరించని వయసులో దేశం గురించి ఆందోళన చెందే వ్యక్తులు చాలా అరుదు. అలాంటి అరుదైన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. గతేడాది జీ20 సదస్సు మన దేశంలో నిర్వహించారు. సదస్సు జరగడానికి ముందే ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్‌లోని నేతలంతా అదో షోగా ఎగతాళి చేసినా.. ఆయన మాత్రం సదస్సు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కొత్త ప్రపంచ క్రమాన్ని నడిపించడంలో దేశం కీలకపాత్ర పోషిస్తోందని, అలాగే తన సార్వభౌమ, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇస్తూ సరైన పనిచేస్తోందని కొనియాడారు. దేశ భవిష్యత్ గురించి ఆశావాహంగా ఉన్నానని చెప్పిన ఆయన.. భారత సమాజం సామరస్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుందంటూ బీజేపీకి చురకలంటించారు. సిగ్గుపడుతూనే కేక్ కట్ చేసి.. వ్యక్తిగత వేడుకలను అంతగా ఇష్టపడని వ్యక్తి మన్మోహన్సింగ్. 2011లో ఐక్యరాజ్యసమితి సమావేశాల అనంతరం న్యూయార్క్ నుంచి ఇండియా వస్తున్నారు. అది కూడా ఆయన జన్మదినమైన సెపె్టంబర్ 26న. దీంతో ఎయిర్ ఇండియా వన్ విమాన సిబ్బంది కేక్ కట్ చేయించాలని ప్లాన్ చేసింది. మన్మోహన్‌కు షుగర్ ఉండటంతో షుగర్ ఫ్రీ కేక్‌ను విమానంలో సిద్ధంగా ఉంచారు. విమానంలో వేడుకలకు ఆయన మర్యాదగా నో చెప్పారు. టేకాఫ్ అయిన తరువాత, పాత్రికేయులను పలకరించడానికి మీడియా విభాగానికి వచ్చినప్పుడు జర్నలిస్టులు అభ్యరి్థంచడంతో ఆయన సిగ్గుపడుతూనే అంగీకరించారు. అందరికీ కేక్ ముక్కలను అందించారు. కుమార్తె కోసం ఒక్కరోజు.. పదేళ్ల పదవీకాలంలో కార్యాలయంలో అందరూ మన్మోహన్సింగ్ను ‘డాక్టర్ సాహెబ్’అని పిలుచుకునేవారు. సుదీర్ఘ విదేశీ పర్యటనలు అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయన అమెరికా అధికారిక పర్యటనలో ఉన్నప్పుడైనా, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్లినా ఒక రోజు మాత్రమే పర్యటనను పొడిగించేవారు. ఆ ఒక్కరోజూ న్యూయార్క్‌లో అటార్నిగా పనిచేస్తున్న తన కుమార్తె అమృత్‌తో గడిపేవారు.యాక్సిడెంటల్ ప్రధాని అంటూ పుస్తకమేసినా.. 2014లో ఆయన పదవినుంచి దిగిపోయాక.. ప్రధాని నివాసాన్ని ఖాళీ చేస్తున్న సమయం. ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’అనే పుస్తకాన్ని ప్రచురించారు. మీడియానో, ప్రతిపక్షాలో కాదు.. తన సేవను చరిత్ర గుర్తిస్తుందని చెప్పిన మన్మోహన్ అన్నింటికీ దూరంగా తన పుస్తకాలను సర్దుకునే పనిలో పడ్డారు. ఆ సందర్భంలో ఆయన పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్‌ను మీడియా కలవగా.. ‘ఆ పుస్తకం నా తండ్రి నమ్మకానికి చేసిన ద్రోహం. ఆయన వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆయన ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేరని.. తన వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న పుస్తకాలను కొత్త ఇంట్లోకి మార్చడంపైనే దృష్టి పెట్టారని.. విమర్శలను ప్టటించుకోని మన్మోహన్ వ్యక్తిత్వం గురించి ఉపిందర్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిరాడంబరత అంటే..?
విజ్ఞానం... సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే. అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం. అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం. నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం. శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు. నిరాడంబరత కొందరికి స్వాభావికం. కానికొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి. నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సాధారణ దుస్తులు ధరించి తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే విలువివ్వాలి. నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది. మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం. నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏమిటా ఐశ్వర్యం..!? పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం. ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం
పలమనేరు (చిత్తూరు జిల్లా): కౌన్సిలర్ కాగానే మందీ మార్బలంతో హంగామా చేసే రాజకీయ నాయకులు మనకు నిత్యం ఎక్కడపడితే అక్కడ తారసపడుతుంటారు. కానీ, పాత తరానికి చెందిన కొందరు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ కోవకు చెందిన వారే పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధులు ఠానేదార్ చిన్నరాజన్. ఈయన పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, రాయలపేటలో 1918 సెప్టెంబర్ 11న తండ్రి అన్నయ్యగౌడుకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఇతని భార్య బద్రాంభ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసి గతంలోనే మృతిచెందారు.( చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు) ఇతనికి నలుగురు సంతానం. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరఫున గెలుపొందారు. ప్రజాసమస్యలపై శాసనసభలో మంచి వక్తగా పేరుంది. 1972లో ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వాలనే ప్రతిపాదనొస్తే సేవచేసే ఎమ్మెల్యేకెందుకయ్యా పింఛనంటూ తొలుత వ్యతిరేకించింది ఇతనే. ఈనెల 11న ఆ మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ 104వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశిష్టతలు ఈ తరం వారి కోసం.. ►పట్టణంలోని కొత్తపేటలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆయనకు సెంటు భూమి లేదు. పైసా నిల్వలేదు. ఉండేందుకు సొంత గూడు కూడా లేదు. ►మాజీ ఎమ్మెల్యేల కోటాలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని వద్దంటూ నిరాకరించారు. ►స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో సొంత నియోజకవర్గంలో ఇవ్వజూపిన భూమిని కూడా వద్దన్నారు. ►ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల పెంపు, దురాక్రమణలో ఉన్న ఆవులపల్లి అడవిని ప్రభుత్వపరం చేయించారు. ►సివిల్ సప్లయిస్ బెల్టు ఏరియా రద్దు తదితరాలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఆలోజింపచేసిన ఘనత ఆయనకే దక్కింది. ►రాజకీయాలంటే కేవలం సేవేగాని సంపాదన కాదని.. నీతి, నిజాయితీలే ఆభరణాలనే సంకల్పంతో ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు. చదవండి: Sai Dharam Tej: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ కెమెరా పుటేజీ వీడియో -
ఆ నేడు 1 అక్టోబర్, 1960
స్వేచ్ఛా ప్రపంచంలోకి... సామ్రాజ్యవాద శక్తుల పిడికిలిలో బందీగా ఉన్న ఆ కాలములోనైనా, ఆత్మగౌరవ నినాదంతో స్వతంత్ర దేశంగా నిలిచిన ఈ కాలంలో అయినా ‘నైజీరియా’ సాంస్కృతిక, చారిత్రక సంపద విశిష్టమైనది. ఆ దేశంలో ప్రవహించే ‘నిగర్’ నది పేరు నుంచి పుట్టింది ‘నైజీరియా’. పదహారవ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగల్లు ఈ నేలపై పాదం మోపాయి. పందొమ్మిదో శతాబ్దంలో ఈ ఆఫ్రికన్ రాజ్యంలో బలీయమైన శక్తిగా అవతరించింది బ్రిటన్. కాలక్రమంలో నైజీరియాను తన పాలనలోకి తెచ్చుకుంది. గతంతో పోల్చితే పాశ్చాత్య చదువు, ఇంగ్లీష్ భాష... ఇలా రకరకాల సౌకర్యాలు వచ్చిపడ్డాయి. ‘సౌకర్యం’ అడుగు పెట్టినంత మాత్రాన ‘స్వాతంత్య్రం’ మౌనంగా ఉండిపోదు కదా! 20 శతాబ్దంలో నైజీరియన్ల స్వతంత్య్ర నినాదం మిన్ను ముట్టింది. బలంలో తనకు ఏమాత్రం సాటిరాని చిన్న దేశం ముందు బ్రిటన్ తలవంచక తప్పలేదు. 1 అక్టోబర్, 1960లో నైజీరియాకు స్వాతంత్య్రం ప్రకటించింది. ‘శాంతి సమన్యాయంతో మా దేశాన్ని బలమైన దేశంగా మార్చు’ అని సృష్టికర్తకు విన్నవించుకుంటుంది నైజీరియా జాతీయ గీతం.