ఆ నేడు 1 అక్టోబర్, 1960
స్వేచ్ఛా ప్రపంచంలోకి...
సామ్రాజ్యవాద శక్తుల పిడికిలిలో బందీగా ఉన్న ఆ కాలములోనైనా, ఆత్మగౌరవ నినాదంతో స్వతంత్ర దేశంగా నిలిచిన ఈ కాలంలో అయినా ‘నైజీరియా’ సాంస్కృతిక, చారిత్రక సంపద విశిష్టమైనది. ఆ దేశంలో ప్రవహించే ‘నిగర్’ నది పేరు నుంచి పుట్టింది ‘నైజీరియా’. పదహారవ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగల్‌లు ఈ నేలపై పాదం మోపాయి. పందొమ్మిదో శతాబ్దంలో ఈ ఆఫ్రికన్ రాజ్యంలో బలీయమైన శక్తిగా అవతరించింది బ్రిటన్. కాలక్రమంలో నైజీరియాను తన పాలనలోకి తెచ్చుకుంది. గతంతో పోల్చితే పాశ్చాత్య చదువు, ఇంగ్లీష్ భాష... ఇలా రకరకాల సౌకర్యాలు వచ్చిపడ్డాయి. ‘సౌకర్యం’ అడుగు పెట్టినంత మాత్రాన ‘స్వాతంత్య్రం’ మౌనంగా ఉండిపోదు కదా! 20 శతాబ్దంలో నైజీరియన్‌ల స్వతంత్య్ర నినాదం మిన్ను ముట్టింది.
బలంలో తనకు ఏమాత్రం సాటిరాని చిన్న దేశం ముందు బ్రిటన్ తలవంచక తప్పలేదు. 1 అక్టోబర్, 1960లో నైజీరియాకు స్వాతంత్య్రం ప్రకటించింది. ‘శాంతి సమన్యాయంతో మా దేశాన్ని బలమైన దేశంగా మార్చు’ అని సృష్టికర్తకు విన్నవించుకుంటుంది నైజీరియా జాతీయ గీతం.