![Hollywood actor Richard Gere slams Donald Trump](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/rich.jpg.webp?itok=27o7pLyX)
ట్రంప్‌పై నటుడు రిచర్డ్ గెరె వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు.
గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం.
ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment