
అన్నీ అస్తవ్యస్త విధానాలే
మూణ్నెల్లలోనే ముచ్చెమటలు
టారిఫ్‌లపై పూటకో మాట
అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలు
మతిలేని వలస విధానం
విద్యాసంస్థలపై ఉక్కుపాదం
అమెరికన్లలోనూ అసంతృప్తి
బాగా పడిపోతున్న ఆదరణ
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు.
అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు.
దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...
మతిలేని టారిఫ్‌ల యుద్ధం
ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు.
ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.
వలసలపై మొట్టి కాయలు
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు.
దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.
డోజ్.. ఓవర్ డోస్
దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జెలెన్‌స్కీకి అవమానం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్‌స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్‌హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి.
ఆదరణ అట్టడుగుకు
ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్‌ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!
దేశాలపై నోటి దురుసు
కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు.
గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.
విద్యాసంస్థలపై ఉక్కుపాదం
తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది.