
స్పెయిన్ చేతిలో పురుషుల జట్టు పరాజయం
ఇంగ్లండ్‌పై మహిళల జట్టు విజయం
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్‌జీత్‌సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు.
స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి.
ఈ క్రమంలో సుఖ్‌జీత్ సింగ్ గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్‌తో భారత్ ఆడనుంది.
హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం
ఎఫ్‌ఐహెచ్ మహిళల ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్‌నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు.

వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్‌గోల్‌తో నవ్‌నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్‌ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్‌తో తొలి క్వార్టర్‌లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది.
రెండో క్వార్టర్‌లో దీపిక గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్‌కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్‌లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment