
‘ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్’పై భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్య
తొలి పోరులో నేడు ఇంగ్లండ్‌తో ‘ఢీ’
స్టార్ స్పోర్ట్స్–3, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్‌ప్రీత్ అన్నాడు. లీగ్‌లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్‌తో భారత్ తలపడుతుంది.
అనంతరం ఆదివారం స్పెయిన్‌తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్‌తో... 24, 25న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్‌లో అన్నీ మ్యాచ్‌లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్‌ప్రీత్ అన్నాడు.
2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment