
‘వాడా’ ‘ఐటీఐఏ’లపై అసంతృప్తి వెలిబుచ్చిన జొకోవిచ్
సినెర్ కేసులో సహేతుకంగా వ్యవహరించలేదన్న సెర్బియా స్టార్
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల చాంపియన్ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు.
నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్ క్రీడ ఇమేజ్‌ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్ డోపింగ్ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు.
వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్ అన్నాడు. ‘సినెర్–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్‌లాగే రెండు నమూనాల్లో పాజిటివ్‌గా తేలిన స్పానిష్ మహిళా ఫిగర్ స్కేటర్ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది.
‘వాడా’ వివరణ ఇది...
మాడ్రిడ్: డోపింగ్‌లో దొరికిన టెన్నిస్ స్టార్ సినెర్‌కు, స్పెయిన్ స్కేటర్ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్‌గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది.
ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్ లేదంటే మసాజ్‌కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్‌లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment