పురుషుల ప్రత్యర్థి స్పెయిన్
మహిళల పోరు ఇంగ్లండ్‌తో
వచ్చే నెల 15 నుంచి ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్
భువనేశ్వర్: భారత హాకీ జట్లు ఈ సీజన్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌తో ప్రారంభించనున్నాయి. భారత్ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్‌తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్‌ను ‘ఢీ’ కొట్టనుంది.
ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్ ఆరంభం కానుంది.
వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్ అంచె ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్‌లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్‌లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు.
భారత్ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్‌ఐహెచ్ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్‌ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్‌లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.
11 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్‌లు పూర్తవడంతో ఫైనల్స్‌కు చేరే నాకౌట్ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్ మహిళల జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ టైటిల్స్ నెగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment