
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి
ఇండియాలో ఏక పార్టీ ఆధిపత్యం ఉత్తమాటే
ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం పెరుగుతోంది
గతేడాది వినాయక చవితికి ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే
మా ఇంటికి వచ్చారు.. దీనిపై అతివిశ్లేషణ అవసరం లేదు
బీబీసీ ఇంటర్వ్యూలో మాజీ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడి
న్యూఢిల్లీ: భారతదేశం ఏకైక రాజకీయ పార్టీ ఆధిపత్యం చెలాయించే దేశంగా మారిపోతోందన్న వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్( DY Chandrachud) తిరస్కరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయని చెప్పారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని స్పష్టంచేశారు. ఇండియాలో న్యాయ వ్యవస్థ చట్టపరిధిలోనే పనిచేస్తోందని ఉద్ఘాటించారు.
న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. తాజాగా బీబీసీ ‘హర్డ్‌టాక్’ఇంటర్వ్యూ(BBC Hard Talk interview)లో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆధిపత్యం కింద ఇండియా ఏక పార్టీ రాజ్యంగా మారుతోందన్న వాదనను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని ఖండించారు.
అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని, దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు.
సుప్రీంకోర్టు పట్ల ప్రజల విశ్వాసం
సొంత పార్టీ నాయకులను రక్షించుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి న్యాయ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఒత్తిళ్లేవీ తనకు ఎదురు కాలేదన్నారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారని, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు.
ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం కల్పించిందని అన్నారు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇండియా కోర్టులు స్థిరంగా పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే కోర్టులు ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసిందని వివరించారు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయినప్పటికీ పౌరుల స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ముందు వరుసలో ఉంటోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు సుప్రీంకోర్టు పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని వెల్లడించారు.
లింగ వివక్ష, వారసత్వ జాడ్యం లేదు
భారత న్యాయ వ్యవస్థపై ఆగ్రవర్ణ హిందూ పురుషులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇక్కడ కూడా వారసత్వ జాడ్యం కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఖండించారు. న్యాయ వ్యవస్థలో లింగ వివక్ష భారీగా తగ్గిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో కొత్తగా చేరుతున్న వారిలో 50 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 నుంచి 70 శాతం ఉందన్నారు. న్యాయ విద్య మహిళలకు చేరువవుతోందని తెలిపారు. లా స్కూళ్లలో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.
న్యాయవాదులు, న్యాయమూర్తులు వారసత్వంగా కోర్టుల్లో చేరుతున్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. తన తండ్రి వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేశారు. సీజేఐగా ఉన్నంత కాలం కోర్టులో అడుగుపెట్టొద్దంటూ తన తండ్రి తనకు చెప్పారన్నారు. దీంతో హార్వర్డ్ లా స్కూల్‌లో మూడేళ్లు చదివానని, తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి కోర్టులో అడుగుపెట్టానని వెల్లడించారు.
ఇండియాలో చాలామంది లాయర్లు, జడ్జిలకు ఎలాంటి న్యాయ నేపథ్యం లేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టీకల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక అంశాలపై నిబంధనల ప్రకారమే తీర్పులు ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజకీయ వాస్తవికతల మధ్య చక్కటి సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
అది మర్యాదపూర్వక కలయిక
గత ఏడాది వినాయక చవితి సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. సీజేఐ ఇంటికి ప్రధానమంత్రి రావడం అత్యంత అరుదు. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. సీజేఐని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రయత్నిచారని మండిపడ్డాయి. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు.
ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే తన నివాసానికి వచ్చారని చెప్పారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తుల మధ్య ఉండే కనీస మర్యాదలను అర్థం చేసుకొనేటంత పరిపక్వత మన వ్యవస్థకు ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మర్యాదపూర్వకమైన కలయికల ప్రభావం కేసుల విచారణపై ఎంతమాత్రం ఉండదన్నారు.
ప్రధాని మోదీ తన నివాసానికి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించిందని, ఇందులో ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిన తీర్పులు సైతం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాత్ర పార్లమెంట్‌లో ప్రతిపక్షం పోషించే పాత్రలాంటిది కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేసులను విచారించడం, చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడడం మాత్రమే న్యాయ వ్యవస్థ బాధ్యత అని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment