కామెంట్
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్‌టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం.
అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్‌ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.
‘హార్డ్‌టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్య క్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.
ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్ టాక్‌ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చు అవు తోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా.
నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలో యర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్‌టాక్ కేవలం ఒక టాక్‌షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు.
అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.
సరే... ఏంటి హార్డ్‌టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసు కున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది.
ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్‌టాక్‌లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్‌లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!
కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది. బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విష యాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్‌టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాక పోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.
చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒక సారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్‌టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యా తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరా«ధన పొందిన హార్డ్‌టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించు కున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్‌ను ఇష్టపడ లేదన్నది బహిరంగ రహస్యం.
2005 నుంచి హార్డ్‌టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వ హిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవ తలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్ లు ఎవరైనా సరే... నిష్టూర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు.
నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్‌నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్‌గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్‌మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్‌నైట్‌లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్ ్స ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ.
అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్ ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే!
విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్‌టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భు తమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’
హార్డ్‌టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్‌టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్‌టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment