
ఈ నెల 9, 10న విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేయనున్నఎంపిక కమిటీ.. వారిలో ఒకరిని డైరెక్టర్‌గా నియమించనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కీలకమైన డైరెక్టర్ల నియామక ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నెల 9న ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పిడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్)ల్లో, 10న తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో), ట్రాన్స్‌కోలో డైరెక్టర్ల నియామకానికి ఇంటర్వ్యూలు చేపడతారు. వాస్తవానికి ఆయా డైరెక్టర్ల పోస్టుల భర్తీకి 2024 జనవరి 29న నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
ఏడాది గడిచిన తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. అన్ని విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్ల పోస్టులకు కలిపి మొత్తం 150కి పైగా దరఖాస్తులు రాగా, నియామక ప్రక్రియలో తీవ్రజాప్యం జరిగింది. దీంతో పెద్దఎత్తున పైరవీలకు ఆస్కారం కలిగిందని ఆరోపణలు వచ్చాయి.
ఉద్వాసన ఉత్తర్వులతో కదలిక..
జెన్‌కో డైరెక్టర్లందరితోపాటు ట్రాన్స్‌కో జేఎండీ, డైరెక్టర్లందరీ నియామకంలో నిబంధనలు పాటించలేదని ప్రకటిస్తూ 2024 జనవరి 27న ఇంధనశాఖ ఉత్తర్వులు (జీవో ఆర్టీ నం.3) జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న 6,729 మంది రిటైర్డు అధికారులు, ఉద్యోగులందరినీ మార్చి 31లోగా తొలగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాత డైరెక్టర్లను తొలగించక తప్పని పరిస్థితి నెలకొంది.
దీంతో ఎట్టకేలకు ఇంధనశాఖ కొత్త డైరెక్టర్ నియామక ప్రక్రియను చేపట్టింది. సీఎస్ ఆదేశాల మేరకు గత మార్చి31తోనే పాత డైరెక్టర్లను తొలగిస్తూ జెన్‌కో, ట్రాన్స్‌కోలు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, కొత్త డైరెక్టర్ల నియామకం వరకు కొనసాగించాలని ఇంధనశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్‌లిస్ట్‌ను రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అందులో నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.