సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏలో ఏసీబీ దాడులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై దాడుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. బాలకృష్ణ ఇంటిపై దాడులు అనంతరం ఏసీబీ అధికారులు తమ దర్యాఫ్తులో భాగంగా హెచ్‌ఎండీఏపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో ప్రణాళికా విభాగం నుంచి ఇచి్చన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినమైనప్పటికీ ప్రణాళికా విభాగానికి చెందిన ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు, జేపీలు, ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
మరోవైపు ఈ మూడేళ్ల అనుమతులకు సంబంధించిన ఫైళ్లను హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిషోర్‌కు కూడా అధికారులు అందజేశారు. శంకర్‌పల్లి, శంషాబాద్, ఘటకేసర్, మేడ్చల్ జోన్‌లలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొందరు అధికారులు ‘డాక్యుమెంట్‌ల పరిశీలన’సాకుతో అక్రమార్జన కోసం నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారు. కన్జర్వేషన్ జోన్‌లలో ఉన్న భూములను యథేచ్చగా కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్‌లలోకి మార్చేశారు.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలోనూ ఇలాంటి అక్రమాలు చాలా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వట్టి నాగులపల్లి ప్రాంతానికి చెందిన సుమారు 70 భూమారి్పడి ఫైళ్లకు ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరిన్ని అక్రమ అనుమతులు ఇచి్చనట్లు లభించిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగంపై దృష్టి సారించినట్లు తెలిసింది.
ఔటర్ సమీపంలో ఉన్న మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రోత్ కారిడార్‌లో భవిష్యత్తులో వాహనాల రద్దీని నియంత్రించేందుకు సమాంతర రహదారుల కోసం కేటాయించిన భూముల్లో పలుచోట్ల ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తెలిసింది. మరోవైపు బాలకృష్ణ ఇంటిపై దాడులు, అతడి అరెస్టు, రిమాండ్ అనంతరం వెలుగులోకి వచి్చన అక్రమ ఆస్తులకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడంతో హెచ్‌ఎండీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అడ్డగోలుగా అనుమతులు
ప్రస్తుతం ఏసీబీ.. బాలకృష్ణకు నమ్మిన బంట్లుగా ఉండి ఆయనకు అన్ని విధాలుగా సహకరించిన కొందరు అధికారులపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. లే అవుట్‌లు, భవన నిర్మాణాలు, ప్రత్యేకించి హైరైజ్ భవనాల కోసం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కొన్నిచోట్ల పర్యావరణ సంస్థలు విధించిన ఆంక్షలను సైతం పక్కన పెట్టి, నీటివనరులు ఉన్న చోట భవనాలకు అనుమతులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో నివాస సముదాయాలు వెలిశాయి. ఇలాంటి అనుమతులను ఇచ్చేందుకు ఒకరిద్దరు ఏపీఓ స్థాయి అధికారులు బాలకృష్ణకు ప్రధాన అనుచరుల మాదిరి వ్యవహరించినట్లు సమాచారం.
ఈ క్రమంలో వారు సైతం రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కీలకమైన జోన్‌లో పని చేస్తున్న ఒక ఏపీఓ బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉండి అన్ని రకాల వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ ఏపీఓపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణపై ఏసీబీ దాడుల అనంతరం ఒకరిద్దరు వ్యక్తిగత కారణాలు చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment