హైదరాబాద్, సాక్షి: హెచ్‌ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు.
పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్‌ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు.
ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్‌ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్‌రామ్‌గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment