rera
-
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
RERA అప్రూవల్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలు చేయడం సురక్షితమేనా..?
-
హైడ్రా కూల్చివేతలు.. RERA చట్టం ఏం చెబుతోంది..?
-
యథేచ్ఛగా ‘ప్రీలాంచ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి ఆశలను కొందరు బిల్డర్లు అడియాసలు చేస్తున్నారు. ప్రీ లాంచ్ దందా నిర్వహిస్తూ, ఆకర్షణీయమైన హామీలు ఎరవేస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన సాహితీ, భువనతేజ, ఓబిలీ హౌసింగ్ వంటి సంస్థల యజమాను లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, కొనుగోలుదారుల సొమ్ముతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా ఎత్తుగడలు వేస్తూ చివరికు బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా కొంపల్లిలో భారతి లేక్‌వ్యూ పేరిట అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రీలాంచ్ ఆఫర్ పెట్టి రూ.60 కోట్లు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వరకు వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, ప్రీలాంచ్ ఆఫర్ల వలలో చిక్కుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు హైదరాబాద్‌లో కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా రియల్టర్ల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఈ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రియల్ వెంచర్ల విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సైతం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తక్కువ ధరకే చదరపు అడుగు పేరిట..హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు అవతల కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చాలామందికి సొంతంగా 100 లేదా 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న ఉద్యోగులు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస వస్తున్న వారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కోకాపేట, గచ్చిబౌలి, మియాపూర్, పటాన్చెరు తదితర డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బడా సంస్థలు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో రియల్టర్లు, భూదందాలు చేసేవాళ్లు కరీంనగర్, వరంగల్, విజయవాడ, మెదక్ హైవేల వైపు దృష్టి సారించి నాలుగైదేళ్ల క్రితమే ఈ ప్రీలాంచ్ దందాకు తెరతీశారు. అంటే ప్రజల ఆశనే పెట్టుబడిగా పెట్టి ఫ్లాట్లు నిర్మించి ఇవ్వడం అన్నమాట. అపార్ట్మెంటులో ఫ్లాట్ చదరపు అడుగు ధర రూ.3వేల నుంచి రూ.5వేల లోపు నిర్ణయించి, నిర్మాణానికి ముందే చెల్లించే పక్షంలో ఇలా తక్కువ ధరకు ఇస్తామని చెబుతూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ తరహా వెంచర్లు హైదరాబాద్ పరిసరాల్లో వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తవుతున్నప్పటికీ మోసపోయిన వాళ్లే అధికంగా ఉంటుండటం గమనార్హం. డబ్బులు చెల్లించినప్పటికీ సరైన సమయంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బిల్డర్ల చుట్టూ కోర్టులు, పురపాలక సంస్థలు, ‘రెరా’ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. నోటీసులకే పరిమితమవుతున్న ‘రెరా’రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడం, వినియోగదారుడి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ‘రెరా’ను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది ఏడాది క్రితం వరకు నామ మాత్రంగానే ఉండిపోయింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సత్యనారాయణ గత సంవత్సరం జూన్‌లో ‘రెరా’ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కొంత కార్యాచరణ మొదలైందని చెప్పవచ్చు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ఫ్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించి, తదనుగుణంగా నోటీసులు జారీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే ప్రీలాంచ్ ఆఫర్ల విషయంలో ‘రెరా’కు సైతం పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేకపోతోంది. ప్రీలాంచ్ ఆఫర్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, ప్రకటనలు విడుదల చేసినా నోటీసులు జారీ చేసి, చర్యలకు స్థానిక పురపాలక, పంచాయతీ సంస్థలకు రిఫర్ చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ప్రీలాంచ్ మోసాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రీలాంచ్ దందాల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులు కూడా ప్రభుత్వం వీటిపై సరైన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్‌ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్‌కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్‌లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్‌ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్‌రామ్‌గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్‌నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్‌కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్‌పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్‌కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్‌లో టెంపుల్ టౌన్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్‌లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్‌లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్‌తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్‌లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
రెరాతో రియల్ దందాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ దందాలకు ఆస్కారం లేకుండా టీఎస్ రెరా (తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) కృషి చేస్తుందని ‘రెరా’ చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ’’ రాష్ట్రంలో 598 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా, 8 ఫ్లాట్లను మించి నిర్మించే ఏ అపార్ట్‌మెంట్‌కు అయినా... రెరా రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ‘ఏ వెంచర్ కోసం కొనుగోలు దారుల నుంచి వసూలు చేశారో.. ఆ మొత్తంలో 70 శాతం అదే వెంచర్లో ఖర్చు చేయాలి. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మాత్రమే అగ్రిమెంట్ సమయంలో చెల్లించాలి. ప్రాజెక్టు ప్లాన్ మార్చాలన్నా... కొనుగోలు దారుల్లో మూడింట రెండొంతుల మంది అనుమతి తప్పనిసరి’... ఇలాంటి నిబంధనలన్నింటినీ తప్పనిసరి చేసేందుకు ‘రెరా’ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ‘రెరా’ నిబంధనలకు లోబడే.. ప్రతీ ప్రాజెక్టు రియల్ వెంచర్ అయినా, భారీ అపార్ట్మెంట్ అయినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముందుగా చెప్పిన దానికి భిన్నంగా నిర్మాణం జరిపినా, పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా, సౌకర్యాలు కల్పించకపోయినా ‘రెరా’ చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో ఏమూలన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా, అపార్ట్మెంట్ కట్టినా ‘రెరా’ వద్ద ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించాలి. దీంతో కొనుగోలుదారుడికి, రియల్ వ్యాపారికి అనుసంధానంగా ఈ సంస్థ పనిచేస్తుంది. 2017లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,805 వెంచర్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ‘రెరా’ వద్దకు రాగా, అందులో 6,770కి అనుమతులు లభించాయి. మరో 35 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ‘రెరా’ చట్టం ప్రకారం రియల్ వెంచర్లు, ఫ్లాట్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (బ్రోకర్లు) కూడా ‘రెరా’ వద్ద రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు 2,912 మంది ఏజెంట్లు రిజిస్టర్ కాగా, మిగతా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ సత్యనారాయణ సూచించారు. కాగా, గతంలో జరిగిన రియల్ దందాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆ లావాదేవీలపైనా విచారించి తప్పు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ..
Oldest Real Estate Agent: వయసు శరీరానికే కానీ ఉత్సాహానికి కాదు.. వృద్ధాప్యం దేహానికే కానీ నిరంతరం పనిచేసే తత్వానికి కాదు.. అని నిరూపిస్తున్నారు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ముంబైలోని ములుండ్ మైక్రో-మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్ఎం మాల్డే. ఓల్డెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మే 20న మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) నిర్వహించిన యోగ్యత పరీక్షలో 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం మార్కులు సాధించారు. మాల్డే నాలుగు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ వయసులో పరీక్ష ఎందుకు? ఈ వయసులో మాల్డే పరీక్ష ఎందుకు రాశారో మనీ కంట్రోల్ వార్తా సంస్థకు తెలియజేశారు. తాను పరీక్ష రాయడానికి కారణాలు కేవలం రెండే రెండు. ఒకటి ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారికి అధీకృత రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా గుర్తిస్తుంది. రెండోది మరికొన్ని ఏళ్లపాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేయాలనేది. తాను ఇన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తనకు అధీకృత గుర్తింపు లేదని, ఈ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాక ఇప్పుడు తనకు గుర్తింపు లభిస్తుందని మాల్డే చెబుతున్నారు. మహారేరా మొదటి బ్యాచ్ పరీక్షకు మాల్డే హాజరయ్యారు. దీని ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అప్పుడు కొంత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తాను కోలుకుని మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశానని, మంచి ఇల్లు కొనాలనుకునేవారికి మంచి సలహాలు, సూచనల ద్వారా సహాయం అందిస్తుంటానని మాల్డే పేర్కొన్నారు. తనకు వ్యాపారం అన్నది ప్రాధాన్యం కాదని, కొనుగోలుదారులకు సరైన గైడెన్స్ ఇవ్వాలన్నది తన ప్రథమ సంకల్పమని వివరించారు. అందుకు తనకు ముంబై ప్రాంతంలో మంచి పేరు ఉందని చెప్పారు. చిన్న గది నుంచి ప్రీమియం అపార్ట్మెంట్ వరకు.. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వృత్తిలో తన ప్రయాణం గురించి మాల్డే మాట్లాడుతూ.. తాను ఒక చిన్న గదిలో నివసించానని, ఈ రోజు ములుండ్ ప్రాంతంలో ప్రీమియం అపార్ట్మెంట్లో ఉంటున్నానని గర్వంగా చెప్పారు. 750 చదరపు అడుగుల కార్పెట్‌తో కూడిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అది. తనకు గుర్తింపుతోపాటు అన్ని ఇచ్చిన తన వృత్తికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా మాల్డే కుమార్తె యూకేలో ఉంటున్నారు. తన 40 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కెరీర్లో మాల్డే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో 20,000కుపైగా లావాదేవీలు చేసుంటారు. ఇప్పటికీ నెలలో కనీసం మూడు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వీటిలో ఒకటి తన కోసం, మరొకటి తన ఉద్యోగుల ఖర్చుల కోసం, మిగిలినది తన ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసమని మాల్డే వివరించారు. కాగా మహారేరా మే 20 న నిర్వహించిన యోగ్యత పరీక్షకు హాజరైనవారిలో 95 శాతం ఉత్తీర్ణులయ్యారని మే 30న ప్రకటించింది. మొదటి బ్యాచ్ పరీక్షకు 423 మంది హాజరుకాగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వారిధిగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది మహారేరా నమోదిత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ రిజిస్ట్రేషన్‌ను వీరు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➦ పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
‘రెరా’ చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌కుమార్ కూడా రెరా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్ పదవి ఖాళీ అయింది. రెరా చైర్మన్‌తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, టౌన్‌ప్లానింగ్‌లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
కౌన్ బనేగా ‘రెరా’ చైర్మన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్‌గా ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్కే జోషి సహా పలువురు పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన అధికారులు చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం. ఈనెల 3తో దరఖాస్తు గడవు ముగియనుంది. ఇప్పటికే 50కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్‌లు చిరంజీవులు, బుసాని వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు కూడా బరిలో ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, టీఎస్ రెరా మాజీ చైర్మన్రాజేశ్వర్ తివారీ ఈసారి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఎంపిక ఎలా ఉంటుందంటే.. టీఎస్ రెరాకు చైర్మన్, సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిబ్రవరి 17ను గడువుగా విధించినా ఆ తర్వాత మార్చి 3 వరకూ పొడిగించింది. రెరా చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు చైర్మన్ పదవికి అర్హులు. వచ్చిన దరఖాస్తుల్లోంచి రెండు పేర్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అందులోంచి ఒకర్ని ప్రభుత్వం చైర్మన్‌గా నియమిస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ లాబీయింగ్ చేశారని, రాష్ట్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా సోమేశ్ పేరు లాంఛనమే అని రియల్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్‌గా నియమితులైన వాళ్లు ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్లోనే.. స్థిరాస్తిరంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని రూపొందించింది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండేళ్లు ఆలస్యంగా 2018లో రెరాను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిస్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. ఇలా అథారిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉండటం గమనార్హం. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన అన్ని నిర్మాణ ప్రాజెక్ట్‌లు టీఎస్ రెరా పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రెరాలో 5 వేలకుపైగా ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. -
నిర్మాణ ప్లాన్స్‌లో డిజిటల్ ఇన్ఫ్రాను చేర్చాల్సిందే!
న్యూఢిల్లీ: భవంతుల నిర్మాణ ప్రణాళికల్లో నీరు, విద్యుత్, గ్యాస్ మొదలైన వాటికి సదుపాయాలు కల్పించినట్లుగానే డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రా (డీసీఐ)కి కూడా చోటు కల్పించాలని ప్రభుత్వానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. డీసీఐ కల్పన, నిర్వహణ, అప్‌గ్రెడేషన్ తదితర అంశాలను కూడా తప్పనిసరిగా పొందుపర్చేలా చూడాలని సూచించింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ చట్టం రెరాలో తగు నిబంధనలను చేర్చాలని పేర్కొంది. ‘డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించి భవంతులకు రేటింగ్’ అంశంపై ప్రభుత్వానికి ఈ మేరకు ట్రాయ్ సిఫార్సులు చేసింది. అపార్ట్మెంట్లు లేదా రియల్టీ ప్రాజెక్టుల్లో ఏదో ఒక నిర్దిష్ట టెల్కో గుత్తాధిపత్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వైర్లెస్ పరికరాలను ఇన్స్టాల్ చేయడం టెలికం లేదా ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు హోల్డర్ బాధ్యతగా ఉంటుందని ట్రాయ్ తెలిపింది. బిల్డింగ్‌ల్లో డీసీఐ ప్రస్తుత ప్రమాణాలు, ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు అప్పగించాలని పేర్కొంది. డిజిటల్ సేవల పటిష్టంపై త్వరలో చర్చాపత్రం దేశీయంగా డిజిటల్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోదగిన చర్యలపై కూడా ట్రాయ్ దృష్టి సారిస్తోంది. డివైజ్‌లు, కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యతపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని రాబోయే నెలల్లో విడుదల చేయనున్నట్లు ఇండియా డిజిటల్ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు. దేశవ్యాప్తంగా టెల్కోలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డివైజ్‌ల రేట్లు అధికంగా ఉన్నాయని సామాన్య ప్రజానీకం భావిస్తున్న నేపథ్యంలో వాఘేలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే 25 ఏళ్లలో దేశీయంగా డిజిటల్ వినియోగాన్ని వేగవంతం చేయాలంటే డిజిటల్ గవర్నెన్స్ మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీపై విధానాల రూపకల్పన వంటి ఎనిమిది కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని వాఘేలా చెప్పారు. ప్రజోపయోగకరమైన ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ వ్యవస్థలతో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు మన దేశ పరిస్థితులకు ఉపయోగపడేలా వినూత్న డిజిటల్ ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందని వాఘేలా తెలిపారు. -
త్వరలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్థి లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటైన ‘రెరా’కు త్వరలో పూర్తిస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో న్యాయబద్ధమైన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (రెరా)లను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా స్థాయి అధికారి చైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇద్దరు పూర్తిస్థాయి సభ్యులు ఉంటారు. అయితే ‘రెరా’కు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రెరాకు వచ్చే దరఖాస్తుల పరిశీలన, అనుమతులు అన్నీ ఆయన నేతృత్వంలోనే సాగేవి. కాగా రియల్ వెంచర్లు, ఫ్లాట్ల నిర్మాణంలో ‘రెరా’ నిబంధనలకు తిలోదకాలిచ్చి పలు సంస్థలు, రియల్ వ్యాపారులు దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పురపాలక శాఖ ఆసక్తి, అర్హత గల వారి నుంచి చైర్పర్సన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తును ఆహ్వానించింది. ఫిబ్రవరి 17వ తేదీలోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని కోరింది. రెరా వెబ్సైట్, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తుదారులకు అవసరమైన అర్హతలు, వేతనం వివరాలన్నీ ఉన్నాయి. -
రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: గృహ కొనుగోలు దారుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తమ అధికార పరిధిలో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) (రెరా) చట్టం, 2016 నిబంధనల అమలుపై కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సోమవారం ఆదేశించింది. రెరా చట్టం కింద నోటిఫై చేయబడిన అమ్మకపు నిబంధనల ఒప్పందం, వాటి అమలు గురించి నిర్దిష్ట సమాచారం కోరుతూ 2022 మార్చిలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిందని, అయితే ఇప్పటి వరకు కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే స్పందించాయని జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘రియల్టీకి సంబంధించి కేంద్రం నిర్వహించే కసరత్తును సులభతరం చేయడానికి, మే 15 లేదా అంతకు ముందు రెరా నిబంధనలపై లేవనెత్తిన ప్రశ్నలకు ప్రతిస్పందించాలని మేము అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తున్నాము‘ అని బెంచ్ పేర్కొంది. రాష్ట్రాల నుండి సంబంధిత సమాచారాన్ని స్వీకరించిన తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఈ అంశంలో అమికస్ క్యూరీ దేవాశిష్ భారుకా ధర్మాసనానికి ఒక నివేదిక సమర్పిస్తారని కూడా బెంచ్ పేర్కొంది. కేసు తదుపరి విచారణను జూలై మూడవ వారానికి వాయిదా వేసింది. అమికస్ దేవాశిష్ ఏమి చెప్పారంటే... రెరా నిబంధనలపై నివేదిక ఎంత వరకూ వచ్చిందని అమికస్ను తొలుత బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు కొన్ని స్పందనలు వచ్చాయని, వాటిలో కొన్ని వైరుధ్యాలు కనిపించాయని ఈ సందర్భంగా అమికస్ తెలిపారు. ఈ వైరుధ్యాలకు కారణాలు ఏమిటని తాము కోరినట్లు కూడా ఆయన వివరించారు. కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు కేవలం ఐదు రాష్ట్రాలే స్పందించాయని తెలిపారు. నివేదిక సిద్ధమైన తర్వాత దానిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశిస్తామని ఆదేశిస్తామని ఈ సందర్భంగా బెంచ్ పేర్కొంది. నోటిఫై చేయని కొన్ని రాష్ట్రాలు... రెరా అమల్లోకి వచ్చిన తర్వాత 2016లో ‘అగ్రిమెంట్ ఫర్ సేల్’ ముసాయిదాను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపి కేంద్రం పంపి వాటిపై అభిప్రాయాలను కోరింది. కొన్ని రాష్ట్రాలు వీటిని నోటిని చేశాయి. పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు అసలు ఈ నిబంధనలను నోటిఫై చేయలేదు. రియల్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాలు కొన్ని మార్పులు చేసి నోటిఫై చేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ భాటి గతంలో కోర్టుకు తెలియజేశారు. మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మోడల్ బిల్డర్–కొనుగోలుదారుల ఒప్పందం ఆవశ్యకతను ఉన్నత న్యాయస్థానం జనవరి 17న ఉద్ఘాటించింది. రెరా నిబంధనల ప్రకారం ఏకరీతి నిబంధనలను రూపొందించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీనిని రాష్ట్రాలకు వదిలివేయడానికి బదులుగా మోడల్ బిల్డర్–బైయర్ ఒప్పందం, మోడల్ ఏజెంట్–కొనుగోలు ఒప్పందాన్ని దేశం మొత్తానికి వర్తింపజేసేలా చర్చలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యేకించి ప్రాథమిక నిబంధనలు, షరతుల విషయంలో కొంత ఏకరూపత ఉండేలా చర్యలు అవసరమని తెలిపింది. ఫ్లాట్ కొనుగోలుదారులు దోపిడీకి గురికాకుండా ఉండేలా కేంద్ర సలహా మండలి రూపొందించిన మోడల్ బిల్డర్–కొనుగోలుదారుల ఒప్పందాన్ని రూపొందించడం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశమని పేర్కొంది. కేంద్రం అఫిడవిట్ ఏమి చెబుతోందంటే.. ఈ వ్యాజ్యంలో కేంద్రం తన అఫిడవిట్‌ను దాఖలు చేస్తూ, ‘‘రియల్టీకి సంబంధించి ఒక బలమైన నియంత్రణ యంత్రాంగం ఉంది. గృహ కొనుగోలుదారుల హక్కులు, ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్న రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనల ప్రకారం విక్రయానికి సంబంధించిన ముసాయిదా ఒప్పందం ఇప్పటికే రూపుదిద్దుకుంది. ప్రమోటర్లలో జవాబుదారీ, పారదర్శక విధానాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం’’ అని పేర్కొంది. ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్, అమ్మకం ముందే రియల్టీ ప్రాజెక్టుల రిజిస్టేషన్ను, సకాలంలో యూనిట్ల డెలివరీని చట్టం నిర్దేశిస్తున్నట్లు తెలిపింది. నిధుల మళ్లింపును నివారించడానికి పటిష్ట నియంత్రణలు విధించినట్లు వివరించింది. వినియోగదారుల రక్షణ కోసం రియల్ ఎస్టేట్ రంగంలో మోడల్ బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యమని గతేడాది అక్టోబర్ 4న సుప్రీం కోర్టు పేర్కొంది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. పిల్ నేపథ్యం... రెరా చట్టం కింద వివిధ రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలు గృహ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఈ విషయంలో గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2016లో కేంద్రం రూపొందించిన నిబంధనలకు– రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలకు ఏమైనా తేడాలున్నాయా అని పరిశీలించి 2022 మే మొదటి వారంలోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ విషయంలో న్యాయవాది దేవాశిష్ భారుకాను అమికస్ క్యూరీగా (కేసు విచారణలో న్యాయ సలహాదారు) నియమించింది. రాష్ట్రాలు రూపొందించన నిబంధనలను పరిశీలించడానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సహాయం చేయాలని దేవాశిశ్ భారుకాకు సూచించింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు బిల్డర్–బయ్యర్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) విచారణలో భాగంగా అత్యున్నత ధర్మాసనం ఈ చొరవ తీసుకుంది. రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఏకరూపత ఒప్పందాలను అన్ని రాష్ట్రాలూ అమ లు చేసేలా చర్యలు ఉండాలని ఆయన కోరారు. రెరా చట్టం, 2016 ప్రకారం కస్టమర్లను రక్షించడానికి, రియల్టీ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి బిల్డర్లు, ఏజెంట్, కొనుగోలుదారు ల కోసం మోడల్ ఒప్పందాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి: రియాల్టీ రంగంలో ఈ విభాగానికి భారీ డిమాండ్! -
రియల్ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017–21 సంవత్సరాల మధ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి 23.9 బిలియన్ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్టు కొలియర్స్–ఫిక్కీ నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే 60 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడం విదేశీ ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో ఈ నివేదిక విడుదలైంది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్ వివరించింది. పెట్టుబడుల వివరాలు.. 2017–21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012–16 మద్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2012–21 మధ్యలో భారత్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017–21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్‌కు పెద్ద పీట రియల్ ఎస్టేట్‌లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017–21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్ స్పేస్ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017–21 మధ్య ఏటా 2 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. నివాసిత ప్రాజెక్టుల పట్ల అప్రమత్తత ఎన్బీఎఫ్సీ రంగంలో సంక్షోభం తర్వాత గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017–21 మధ్య 11 శాతానికి తగ్గింది. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఇది 37 శాతంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. ఆల్టర్నేటివ్ అసెట్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. డేటా సెంటర్ల బూమ్ డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్‌కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
తెలంగాణ నంబర్4
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యకలాపాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదులో దేశంలోనే తెలంగాణ నాల్గో స్థానంలో నిలిచింది. టీఎస్ రెరాలో 4,002 రియల్టీ ప్రాజెక్ట్‌లు, 2,017 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,248 ప్రాజెక్ట్‌లు, 151 మంది మధ్యవర్తులు నమోదయ్యా రు. దేశవ్యాప్తంగా 74,088 ప్రాజెక్ట్‌లు, 58,790 మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 33,154 ప్రాజెక్ట్‌లు 11,231 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. గుజరాత్లో 9,689 ప్రాజెక్ట్‌లు, 2,695 మంది మధ్యవర్తులు, మధ్యప్రదేశ్‌లో 4,016 ప్రాజెక్ట్‌లు 935 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక రెరాలో వెయ్యికి పైగా ప్రా జెక్ట్లు రిజిస్టరయ్యాయి. అత్యల్పంగా ఎన్సీఆర్ రెరాలో 34, పాండిచ్చేరి రెరాలో 194, ఉత్తరాఖండ్‌లో 332 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. శాశ్వత అథారిటీ లేదు.. తెలంగాణ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే శాశ్వత రెరా అథారిటీ లేదు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఇంటెర్మ్ రెరా అథారిటీనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రెరాను ఏర్పాటు చేయని రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. -
ఖాళీ స్థలం చూపిస్తారు..మొత్తం చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే ఫ్లాట్..!
సాక్షి, హైదరాబాద్: కస్టమర్లకు ఆకాశంలో పిట్టను చూపించి కింద మసాలా నూరిస్తున్నారు డెవలపర్లు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. సాధారణంగా డెవలపర్ చదరపు అడుగు (చ.అ.) రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ప్రీ లాంచ్, యూడీఎస్ స్కీమ్స్‌లో వంద శాతం సొమ్ము చెల్లిస్తే మాత్రం రూ.3 వేలకే అమ్ముతారు. నిర్మాణ అనుమతులు వచ్చి, రెరాలో నమోదయ్యాక ఇందులో ధర రూ.5,500లకు చేరుతుంది. ఎందుకంటే ఆయా అనుమతుల కోసం డెవలపర్ కొంత ఆమ్యామ్యాలు సమర్పించుకుంటాడు కాబట్టి. ఈ ఖర్చును ధరను పెంచేసి భర్తీ చేసుకుంటాడు డెవలపర్. ఇదే ప్రాజెక్ట్‌లో ప్రీలాంచ్, యూడీఎస్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు చ.అ. రూ.3,500 చొప్పున రీసేల్‌కు పెడతాడు. కొనేందుకు వచ్చిన ఏ కస్టమర్ అయినా రీసేల్ ప్రాపర్టీకే ఆకర్షితుడవుతాడు. దీంతో డెవలపర్ వాటా ఫ్లాట్లు విక్రయం కాక చేతిలో నిర్మాణ వ్యయం లేక పనులను నిలిపివేస్తాడు. దీంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎవరు నిర్మిస్తున్నారంటే? చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ఇదే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇటీవల కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా యూడీఎస్ స్కీమ్‌తో పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాయి. ఇటీవలే నానక్‌రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లిహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ ఇదే తరహా విక్రయాలు చేపడుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు లేదా స్థలాల విక్రయాల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. ప్రధాన కంపెనీలు తమ పాత కస్టమర్లకు ఇంటర్నల్ సేల్స్ చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. 100 శాతం పేమెంట్‌తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమీషన్‌ను అందిస్తున్నాయి. ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్ట్‌లన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ కమీషన్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను కడతాడా? లేదా అని ఆలోచించట్లేదు. పొరపాటు బిల్డర్ ప్రాజెక్ట్‌ను కట్టకపోయినా.. సమయానికి డెలివరీ చేయకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్)ను రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు టీఎస్ రెరాకు 70 వేలకు పైగానే ఫిర్యాదులు అందాయి. కానీ, ఒక్క కేసు నమోదు చేయలేదు. కేవలం నోటీసులు జారీ చేసి జరిమానాలతోనే సరిపెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెçసులుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలంటే? ► హెచ్ఎండీఏ, రెరా విభాగాలకు శాశ్వత చైర్మన్లను నియమించాలి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. రెరా అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి. ► రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి. ► రెరా అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడానికి బదులు శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. ► ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్బుక్, ఇన్‌సాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి. ► ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలి. రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబరు క్రియేట్ చేసి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇ వ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
టీఎస్ రెరాలో 3,630; ఏపీ రెరాలో 2,049
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అండ్ డెవలప్మెంట్ చట్టం (రెరా) అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,049 ప్రాజెక్ట్‌లు, 149 మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 158 ఫిర్యాదులను ఏపీ రెరా పరిష్కరించింది. అలాగే తెలంగాణ రెరాలో 3,630 ప్రాజెక్ట్‌లు, 1,891 ఏజెంట్లు రిజిస్టర్ కాగా.. ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కరించలేదు. దేశంలో రెరా అమల్లోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో 71,307 ప్రాజెక్ట్‌లు, దేశవ్యాప్తంగా 56,177 మంది ఏజెంట్లు నమోదయ్యారని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రెరాలో అత్యధికంగా ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి. 2019 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మహారాష్ట్రలో 31,664, గుజరాత్లో 9,272, కర్ణాటక రెరాలో 4,497 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. గత రెండేళ్లలో ఆయా రాష్ట్రాల రెరాలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లలో 49 శాతం, ఫిర్యాదుల పరిష్కారంలో 128 శాతం వృద్ధి నమోదయింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల రెరా అథారిటీలు 78,903 ఫిర్యాదులను పరిష్కరించాయి. రెరాకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు ముందంజలో ఉన్నాయి. యూపీలో 30,990 కేసులు, హర్యానాలో 16,864 కేసులు పరిష్కారమయ్యాయి. ఇదీ రెరా పరిస్థితి.. నాగాలాండ్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి. 30 రాష్ట్రాలు, యూటీలు రెరా అథారిటీని ఏర్పాటు చేశాయి. ఇందులో 25 రెగ్యులర్ అథారిటీ కాగా, 5 మధ్యంతర అథారిటీలున్నాయి. జమ్మూ అండ్ కశ్మీర్, లడక్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి కానీ అథారిటీలను ఏర్పాటు చేయలేదు. కాగా 28 రాష్ట్రాలు, యూటీలు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడక్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లు ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాలు రెరా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లూ రెరాలోకి.. సుప్రీంకోర్టు రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అండ్ డెవలప్మెంట్ చట్టం–2016 పరిధిని విస్తృతం చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి వచ్చే వరకూ కంప్లీషన్ సర్టిఫికెట్ పొందలేరని వ్యాఖ్యానించింది. అంటే నిర్మాణం లో ఉన్న ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలోకి చేర్చకుండా రెరా నిబంధనలను బలహీనపరిచిన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెరా జరిమానా విధించిన డెవలపర్లు అప్పీల్‌కు వెళ్లినా సరే.. జరిమానా మొత్తం లో 25 శాతం రెరా వద్ద డిపాజిట్ చేయాలి. నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయి.. సుప్రీం ఆదేశాల మేరకు నిర్మాణంలోని ప్రాజెక్ట్ లు రెరా పరిధిలోకి వస్తే వచ్చే రెండేళ్లలో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు మరింత వేగంగా పూర్తవుతా యని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు రెరా పరిధిలోకి రాని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టిసారించారన్నారు. దీంతో కొన్నేళ్లుగా నిర్మాణం జరుగుతున్న, మధ్యలో నిలిచిపోయిన గృహాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2014, అంతకంటే ముందు ప్రారంభమై ఇప్ప టికీ పూర్తి కాకుండా 6.29 లక్షల గృహాలున్నాయి. -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
అవగాహన లేకుండా పెట్టుబడులొద్దు
హోల్‌సేల్, రిటైల్ వ్యాపార విధానాలు ఎలా ఉంటాయో.. సేమ్ అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) ప్రాజెక్ట్‌లుంటాయి. హోల్‌సేల్‌లో పెద్ద మొత్తంలో మాత్రమే విక్రయిస్తే.. కొనుగోలుదారులకు ఎంత కావాలంటే ఆ స్థాయిలో చిన్న మొత్తంలో విక్రయించడం రిటైల్ వ్యాపార విధానం. ఇదే తరహాలో యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేస్తుంటారు డెవలపర్లు. ఎప్పుడైతే ఎకరాల నుంచి గజాల చొప్పున కొనుగోళ్లు మొదలయ్యాయో.. అప్పటినుంచి యూడీఎస్ ప్రాజెక్ట్‌లకు ఆకాశమే హద్దుగా మారింది. పెట్టుబడుల మొత్తాన్ని బట్టి స్థలాన్ని విక్రయిస్తుండటం, సామాన్య, మధ్యతరగతి వర్గాలూ యూడీఎస్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తుండటం దీనికి ప్రధాన కారణం. సాక్షి, హైదరాబాద్: యూడీఎస్ ప్రాజెక్ట్‌లనేవి అనాదిగా ఉన్నవే కానీ, పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) తర్వాత నగదు కొరత కారణంగా చిన్న మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడం మొదలైంది. కోట్ల నుంచి లక్షలకు, ఎకరాల నుంచి గజాల్లోకి ఎప్పుడైతే పెట్టుబడులు రూపాంతరం చెందాయో అప్పటి నుంచి యూడీఎస్ ప్రాజెక్ట్‌లు కోకొల్లలయ్యాయి. గతంలో ఎకరాల చొప్పున చేసే యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు ఎందుకంటే పెట్టుబడులూ పెద్దగానే ఉంటాయి కాబట్టి. దీంతో డెవలపర్లూ ఆ తరహా ప్రాజెక్ట్‌లూ పెద్దగా చేసేవారు కాదు. కానీ, ఎప్పుడైతే ఎకరాలకు బదులుగా గజాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారో అప్పటి నుంచే బిల్డర్లకు కూడా యూడీఎస్ ప్రాజెక్ట్‌లపై మోజు పెరిగింది. అవగాహన లేకపోతే.. సామాన్యులు, మధ్యతరహా వర్గాలు కూడా యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే అంత త్వరగా డెవలపర్లకు చేతిలో నగదు చేరుతుంది. ఇచ్చిన హామీ ప్రకారం బిల్డర్ యూడీఎస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. కానీ, నిర్మాణ అనుమతుల్లోనో లేక లే–అవుట్ ప్లాన్, డిజైన్స్లోనో లేక ఇతరత్రా ఇబ్బందులు తలెత్తితే మాత్రం బిల్డర్‌తో పాటూ ఆ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా చిక్కుల్లో పడిపోతారు. సాధారణంగా కోట్లలో పెట్టుబడులు పెట్టేవారికి యూడీఎస్ ప్రాజెక్ట్‌ల విధానాలపై అనుభవం ఉంటుంది. లేకపోతే ప్రొఫెషనల్స్, నిపుణుల సలహా తీసుకోనైనా పెట్టుబడి నిర్ణయం తీసుకుంటుంటారు. అదే సామాన్య, మధ్య తరగతి వారికి ఈ తరహా ప్రాజెక్ట్‌లపై అవగాహన ఉండదు. తక్కువ ధరకు వస్తుందనేదొక్కటే ఆలోచిస్తారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏ మాత్రం చిన్న సమస్య తలెత్తినా నెత్తినోరు బాదుకున్నా ప్రయోజనం ఉండదు. యూడీఎస్ ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయంటే.. స్థలం కొనుగోలు, ప్లాన్స్, డిజైన్స్, అనుమతులు, నిర్మాణ సామగ్రి సమీకరణ.. ఇలా ఏ అంశంలోనూ డెవలపర్ జేబు నుంచి డబ్బులు పెట్టడు. జస్ట్, స్థల యజమానితో ఒప్పందం చేసుకొని ప్రాజెక్ట్‌ను మార్కెట్లో పెట్టేస్తాడు. ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అందమైన బ్రోచర్లు ముద్రించి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. వాటిలో కొంత మొత్తాన్ని స్థల యజమానికి ఇస్తూ కాలం గడుపుతుంటాడు. యజమానికి మొత్తం డబ్బు చేరితే తప్ప రిజిస్ట్రేషన్లు జరగవు. ఆ తర్వాతే నిర్మాణ అనుమతులు, నిర్మాణ పనులు మొదలవుతాయి. నిర్మాణ అనుమతుల్లో ఏమైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సదరు బిల్డర్ ఆ ప్రాజెక్ట్‌ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నదే లక్ష డాలర్ల ప్రశ్న. స్థల సమీకరణ ఒక్కటే సరిపోదు.. ప్రాజెక్ట్‌ను చేపట్టాలంటే స్థల సమీకరణ అనేది చాలా చిన్న పార్ట్. దాని కంటే కీలకమైనవి.. విధానం, డిజైన్స్, అనుమతులు, ఆర్థిక శక్తి, విస్తృతమైన మార్కెటింగ్ బృందం ఉండాలి. చాలా మంది కొనుగోలుదారులకు డెవలపర్ పేరు మీద స్థలం తాలూకు కాగితాలు ఉన్నాయో లేవో చూస్తారంతే, మిగిలిన విషయాలు పట్టించుకోరు. ఇదే యూడీఎస్ డెవలపర్లకు అవకాశంగా మారిపోతుంది. న్యాయపరమైన అవగాహన, మార్కెట్‌ను అధ్యయనం, మంచి కస్టమర్ బేస్.. ఇవేవీ లేకుండానే ‘ఎవడితో కత్తి.. ఎవడితో నెత్తి’అన్నట్లు ఏమాత్రం అనుభవం లేనివాళ్లు బిల్డర్లుగా మారి యూడీఎస్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. కనీసం ఇటుక కూడా పట్టుకోవడం రాని వాళ్లు కూడా రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. డెవలపర్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించకుండానే ధర తక్కువ అనగానే సంతోషంతో గంతేసి పెట్టుబడులు పెడుతుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో డెవలపర్ విఫలమై, నిర్మాణం ఆగిపోగానే ఇదేదో ప్రభుత్వ తప్పు అన్నట్లు గగ్గోలు పెడుతుంటారు. ఫలానా డెవలపర్ అన్యాయం చేశాడంటూ ప్రభుత్వాన్ని నిందిస్తుంటారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా.. గత మూడేళ్లుగా హైదరాబాద్‌లో యూడీఎస్ ప్రాజెక్ట్‌లు విపరీతమయ్యాయి. కోకాపేట, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ వంటి స్థలాల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యూడీఎస్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో ధర తక్కువ అనగానే కొనుగోలుదారులు కూడా సులువుగా బుట్టలో పడతారు. ఇలా చాలా మంది కస్టమర్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు. ఆ ఇన్వెంటరీ అంతా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. స్థల యజమానులు మార్కెట్‌ను అతిగా ఊహించుకొని డెవలపర్లను ఎక్కువ మార్జిన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ స్థితిగతులను అర్థం చేసుకోవటం లేదు. దీంతో ప్రాజెక్ట్ నిష్పత్తి పెరుగుతుంది. ఈ 12 సూత్రాలు పాటిస్తే సొంతింటికి చేరినట్లే.. డెవలపర్ గత చరిత్ర, ప్రొఫైల్ చెక్ చేయాలి. గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు తెలుసుకో వాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లలో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయో కనుక్కోవాలి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కస్టమర్లతో బిల్డర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. గడువులోగా నిర్మాణం పూర్తి చేస్తాడా? లేదా? తనిఖీ చేసుకోవాలి. బ్రోచర్లో ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తాడా లేదా తెలుసుకోవాలి. డెవలపర్ ఆర్థిక సామర్థ్యం కనుక్కోవాలి. బహుళ ప్రాజెక్ట్‌లను చేపట్టే బిల్డర్‌తో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా సమస్యలు తలెత్తినా వేరే ప్రాజెక్ట్‌లో అయినా సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. నిర్మాణ అనుమతులు, రెరా నమోదు గురించి భౌతికంగా తనిఖీ చేయాలి. ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల రీపేమెంట్ గురించి ఆరా తీయాలి. డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత గురించి కూడా పరిశీలించాలి. -
రియల్టీకి యూడీఎస్ భూతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) భూతం పట్టుకుంది. అవిభాజ్య స్థలం ధర తక్కువే ఉంటుంది కావచ్చు.. కానీ, స్థలానికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా, నిర్మాణ అనుమతులు రాకపోయినా నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే. యూడీఎస్లో కొనుగోలు చేస్తే కలిగే నష్టాలపై కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల నుంచి మాత్రం కొనుగోళ్లు జరపాలని సూచిస్తుంది. 2017, జనవరి 1వ తేదీ తర్వాత 500 చ.మీ. లేదా 6 యూనిట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) నిబంధనలను పాటించాల్సిందే. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ టీఎస్–రెరాలో నమోదైందో లేదో నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవటం ఉత్తమమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి తగ్గ విలువను, సామాన్యుల పెట్టుబడులకు భరోసాను కల్పించే రెరా ప్రాజెక్ట్‌లలోనే విక్రయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని, దీంతో గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విస్తరణ, వ్యాపార పెట్టుబడులతో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో అధిక శాతం కొనుగోలుదారులు తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు ఉంటారు. వీరికి నిర్ధిష్టమైన వనరులు, రియల్టీ లావాదేవీలపై అవగాహన కాసింత తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కొనుగోలుదారులు బిల్డర్ల ప్రొఫైల్‌ను పరిశీలించకుండా తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేస్తుంటారని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెరా నమోదిత ప్రాజెక్ట్‌లలో కొంటేనే కస్టమర్ల కష్టార్జితానికి పూర్తి విలువ చేకూరుతుందని పేర్కొన్నారు. యూడీఎస్లో కొంటే కొనుగోలు లేదా సమీకరణ చేసిన స్థల విలువకు ప్రామాణికత ఉండదు జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతులు ఉండవు. రెరా అథారిటీ వద్ద నమోదు కాదు. స్థలం అమ్మకం అనధికారిక అగ్రిమెంట్ లేదా జీపీఏ ద్వారా చేస్తారు. రెరా లేదా ఇతర సంస్థల నుంచి కొనుగోలుదారులకు రక్షణ ఉండదు. భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేటు తక్కువే కానీ సురక్షితం ఏమాత్రం కాదు. రెరాలో కొంటే సేకరణ లేదా కొనుగోలులో స్థల విలువకు ప్రామాణికత ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉంటాయి. రెరాలో నమోదు అవుతుంది, రెరా నంబర్ కూడా కేటాయిస్తారు. అమ్మకం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే ఉంటుంది. రెరా అథారిటీలోని పలు నిబంధనలు కస్టమర్లకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి వివాదాలు తలెత్తినా రెరా అథారిటీ పరిష్కరిస్తుంది. ధర ఎక్కువైనా.. ప్రాపర్టీ మాత్రం సురక్షితం. -
ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి
ట్విన్ టవర్స్ కూల్చివేత తీర్పుపై నిర్మాణ సంస్థ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా అన్నారు. రేరా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ భవనాలు నిర్మించామని తెలిపారు. అంతేకాదు కోర్టు తీర్పు వల్ల తమ కంపెనీపై చెడు ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడాలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల ట్విన్ టవర్స్ నిర్మిచండంపై ఇటు అలహాబాద్ హైకోర్టుతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూడు నెలలల్లోగా ఈ భవనాలను కూల్చేయడంతో పాటు అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ట్విట్ టవర్స్‌లో 21 దుకాణాలతో పాటు 915 ప్లాట్స్ ఉన్నాయి. చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్‌లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది. రేరా సరిపోదా ? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది. - రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు - బిల్డర్‌కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్‌ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్‌గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. - సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్‌కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది. చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి