రెరాతో భరోసా | RERA to take off from today KTR to inaugurate city office | Sakshi
Sakshi News home page

రెరాతో భరోసా

Published Sat, Sep 1 2018 9:18 AM | Last Updated on Fri, Sep 7 2018 11:15 AM

RERA to take off from today KTR to inaugurate city office - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరంలో రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు ఇక తెరపడనుంది. ఆయా నిర్మాణాలకు అనుమతి పొందకుండానే అనుమతి పొందినట్లు ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించే మోసగాళ్లకు చెక్‌ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం  ‘టీఎస్‌ రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)యాక్ట్‌– రెరా’ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఇళ్ల కోసం ప్రజల నుంచి పెద్దమొత్తంలో అడ్వాన్సులు స్వీకరించడమే కాక మొత్తం సొమ్ము వసూలు చేసినా, నిర్ణీత వ్యవధిలో ఇళ్లు నిర్మించకుండా ముప్పుతిప్పలు పెడుతున్న రియల్టర్ల బారి నుంచి సామాన్యులకు రక్షణగా రెరా చట్టం నిలవనుంది. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టును పూర్తిచేయని వారికి  పెనాల్టీలు పడనున్నాయి.

2017 జనవరి1 నుంచి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో అనుమతి పొందిన ప్రాజెకులన్నీ రెరా వద్ద నమోదు చేసుకోవాలి. నవంబర్‌ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికావాలి. 500 చ.మీ. కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఇళ్లు, 8 ఫ్లాట్లు దాటిన అపార్ట్‌మెంట్స్‌ నిర్మించే అన్ని నివాస, వాణిజ్య భవనాలకు, లేఔట్స్‌కు ఇది వర్తిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నవారు అనుమతి పొందాక తమ ప్రాజెక్టును రెరా వద్ద నమోదు చేసి, వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరచాలి. మూడునెలలకోమారు పనుల పురోగతి వివరాలు అప్‌డేట్‌చేయాలి. తద్వారా కొనుగోలుదారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తుంది. అనుమతి పొందిన ప్లాన్‌ అసలు ప్రతి, రివైజ్‌ చేస్తే ఆ వివరాలు, ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుందో ఆ వివరాలు స్పష్టంగా వెల్లడించాలి. ఈ చట్టం వల్ల సామాన్యప్రజల ప్రయోజనాలకు రక్షణతోపాటు రియల్‌ఎస్టేట్‌ రంగం పురోగతికీఉపకరిస్తుందనిజీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో2985 ప్రాజెక్టులు..
2017 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులు పొందిన 2985 ప్రాజెక్టులు, హెచ్‌ఎండీఏ పరిధిలోని 840 ప్రాజెక్టుల వివరాలను రెరా వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. నవంబర్‌ నెలాఖరులోగా సంబంధిత డెవలపర్లు తమ ప్రాజెక్టుల్ని రెరా వద్ద నమోదు చేయించుకోవాలి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శక ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తవుతాయి.  

ఇంకా..
బిల్డర్లు తమ కంపెనీ వివరాలు, స్థలంపై యాజమాన్య హక్కు,ఆర్థిక పరిస్థితి, చేపట్టే నిర్మాణాల వివరాలు, లీగల్‌ క్లియరెన్స్‌లు తదితరమైనవన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
రెరా అథారిటీ వద్ద వివరాలు నమోదు చేసుకున్నాకే వ్యాపార ప్రకటనలు ఇవ్వాలి.  
అనుమతి పొందిన ప్లాన్‌ను రివైజ్‌ చేయాల్సి వస్తే ఫ్లాట్లు బుక్‌చేసుకున్న వారి అనుమతితోనే రివైజ్‌ చేయాలి.
ప్రాజెక్ట్‌ అభివృద్ధి ప్రణాళిక, నిర్మిత స్థలం, కార్పెట్‌ ఏరియా వివరాలు పేర్కొనాలి.
ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలపాలి.  నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తికాని పక్షంలో ఆలస్యం అయ్యే కాలానికి కొనుగోలుదారులు చెల్లించిన సొమ్ముకు బిల్డర్లు వడ్డీ చెల్లించాలి.అలాగే కొనుగోలుదారుల చెల్లింపు ఆలస్యమైనా వడ్డీ కట్టాలి.
ఇళ్ల కొనుగోలుదారులు తాము మోసపోతే వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  
నిబంధనలను అతిక్రమించే వారికి జరిమానాలతో పాటు జైలుశిక్షలు కూడా విధించవచ్చు.  

ఫిర్యాదు చేయవచ్చు ఇలా..
ఆన్‌లైన్‌ద్వారా రెరా వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయాలి.
ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ నెంబరును ఫిర్యాదులో  పేర్కొనాలి.
నిర్ణీత ఫీజు రూ. 1000 చెల్లించాలి.
డెవలపర్‌కు రెరా అథారిటీ నోటీసు జారీ చేస్తుంది.  
డెవలపర్‌ నిర్ణీత వ్యవధిలో సమాధానం ఇవ్వాలి. నిర్ణీత తేదీన విచారణకు హాజరు కావాలి. ఫిర్యాదుదారు కూడా హాజరుకావాలి. ఉభయుల వాదనలు విన్నాక అథారిటీ తగిన ఉత్తర్వు జారీ చేస్తుంది. సంతృప్తిచెందని పక్షంలో రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement