సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ దందాలకు ఆస్కారం లేకుండా టీఎస్ రెరా (తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) కృషి చేస్తుందని ‘రెరా’ చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ’’ రాష్ట్రంలో 598 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా, 8 ఫ్లాట్లను మించి నిర్మించే ఏ అపార్ట్మెంట్కు అయినా... రెరా రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి చేయనున్నారు.
‘ఏ వెంచర్ కోసం కొనుగోలు దారుల నుంచి వసూలు చేశారో.. ఆ మొత్తంలో 70 శాతం అదే వెంచర్‌లో ఖర్చు చేయాలి. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మాత్రమే అగ్రిమెంట్ సమయంలో చెల్లించాలి. ప్రాజెక్టు ప్లాన్ మార్చాలన్నా... కొనుగోలు దారుల్లో మూడింట రెండొంతుల మంది అనుమతి తప్పనిసరి’... ఇలాంటి నిబంధనలన్నింటినీ తప్పనిసరి చేసేందుకు ‘రెరా’ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
‘రెరా’ నిబంధనలకు లోబడే.. ప్రతీ ప్రాజెక్టు
రియల్ వెంచర్ అయినా, భారీ అపార్ట్‌మెంట్ అయినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముందుగా చెప్పిన దానికి భిన్నంగా నిర్మాణం జరిపినా, పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా, సౌకర్యాలు కల్పించకపోయినా ‘రెరా’ చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో ఏమూలన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా, అపార్ట్‌మెంట్ కట్టినా ‘రెరా’ వద్ద ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించాలి. దీంతో కొనుగోలుదారుడికి, రియల్ వ్యాపారికి అనుసంధానంగా ఈ సంస్థ పనిచేస్తుంది.
2017లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,805 వెంచర్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ‘రెరా’ వద్దకు రాగా, అందులో 6,770కి అనుమతులు లభించాయి. మరో 35 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు సత్యనారాయణ తెలిపారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే
‘రెరా’ చట్టం ప్రకారం రియల్ వెంచర్లు, ఫ్లాట్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (బ్రోకర్లు) కూడా ‘రెరా’ వద్ద రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు 2,912 మంది ఏజెంట్లు రిజిస్టర్ కాగా, మిగతా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ సత్యనారాయణ సూచించారు. కాగా, గతంలో జరిగిన రియల్ దందాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆ లావాదేవీలపైనా విచారించి తప్పు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment