త్వరలో టీజీ రెరా యాప్‌.. | TG RERA has an official app and website to promote transparency in the real estate sector | Sakshi
Sakshi News home page

త్వరలో టీజీ రెరా యాప్‌..

Published Sat, Dec 28 2024 1:44 PM | Last Updated on Sat, Dec 28 2024 1:53 PM

TG RERA has an official app and website to promote transparency in the real estate sector

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్‌ ఎస్టేట్‌(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్‌ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్‌ కోడ్‌ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్‌సైట్‌(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరో

నివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదా?

జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్‌ కూడా ఆర్‌ఈ(R and D) చట్టంలోని సెక్షన్‌–3 కింద రిజిస్ట్రేషన్‌ చేయాలి.

రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్‌ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్‌(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్‌ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్‌ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.

ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్‌ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్‌సైట్‌ ద్వారా ప్రాజెక్ట్‌ రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్‌ టైటిల్, ఆమోదిత లేఔట్‌ ప్లాన్, ప్రాజెక్ట్‌ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్‌ డీడ్స్, ప్రాజెక్ట్‌ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.

బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి?  

జవాబు: రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్‌ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్‌ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే  https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.

ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి?

జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్‌ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్‌ 516, వరంగల్‌ అర్బన్‌ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్‌ 257, ఖమ్మం 280, నిజామాబాద్‌ 158, కరీంనగర్‌ 144, సిద్దిపేట 101, వికారాబాద్‌ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్‌ 66, మెదక్‌ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్‌ 31, మహబూబాబాద్‌ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్‌ 17, నిర్మల్‌ 12, వరంగల్‌ రూరల్‌ 12, జయశంకర్‌ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.

ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?

జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.

నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?

జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్‌ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్‌ఈ(ఆర్‌అండ్‌డీ) చట్టం–2016లోని సెక్షన్‌ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.

ఇప్పటి వరకు ఎంత మంది రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు?

జవాబు: రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్‌ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.

ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..

ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్‌ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, 
భారతి ఇన్‌ఫ్రా డెవలపర్స్, రియల్‌ ఎస్టేట్‌ అవెన్యూ కన్సల్టెంట్‌ సర్వీసెస్, యంగ్‌ ఇండియా హౌసింగ్‌ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్‌ చర్యలు కూడా ప్రారంభించారు.

ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?

జవాబు: టీజీ రెరా పోర్టల్‌ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement