ఐటీ, ఫార్మా నుంచి పెరిగిన లావాదేవీలు
ఇళ్లు, ఆఫీసులు, గిడ్డంగులు, డేటా సెంటర్లకు గిరాకీ
ఫోర్త్‌సిటీ, మెట్రో, ట్రిపుల్ ఆర్‌లతో భవిష్యత్ ఆశాజనకం
దేశీయ స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ పవర్ హౌస్‌గా మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), లైఫ్ సైన్స్ రంగాల బహుళ స్థిరాస్తి పెట్టుబడులకు వేదికగా అభివృద్ధి చెందింది. గతంలో సిటీ రియల్ ఎస్టేట్‌లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండేవి. కానీ, కొంతకాలంగా ఫార్మాసూటికల్స్ రంగం నుంచి కూడా పెట్టుబడులు, కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో గృహాలు, ఆఫీసులు, గిడ్డండులు, డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరో
ఇదీ రియల్ వృద్ధి..
హైదరాబాద్‌లో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో రూ.36,461 కోట్లు విలువ చేసే రూ.59,386 గృహాలు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే మార్కెట్‌లోకి కొత్తగా 85 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్‌తో కలిపి మొత్తం 87 లక్షల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. ఇక గ్రేటర్‌లో 54 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం, 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.
భవిష్యత్తులో మరింత జోష్
ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, టీ–స్క్వేర్, ఫార్మా క్లస్టర్లు, మెట్రో విస్తరణతో పాటు విమానాశ్రయంతో కనెక్టివిటీ, రీజినల్ రింగ్‌రోడ్ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో సిటీ విస్తరణ పెరగడంతో పాటు పెట్టుబడులకు అపారమైన
అవకాశాలు ఏర్పడతాయి. దీంతో హైదరాబాద్‌లో ఇళ్లు, ఆఫీసులు, వేర్‌హౌస్, డేటా సెంటర్లకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే 3–4 ఏళ్లలో నగరంలో కొత్తగా లక్ష గృహాలు లాంచింగ్ అవుతాయని, 2026 నాటికి ఏటా 1.7–1.9 కోట్ల చ.అ. ఆఫీసు స్థలాన్ని అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో వేర్‌హౌస్ స్థలం 40 లక్షల చ.అ.కు, డేటా సెంటర్ల సామర్థ్యం 23 మెగావాట్లకు విస్తరిస్తాయని అంచనా.
ఐటీ వర్సెస్ ఫార్మా..
ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు, ఉత్పత్తులతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరొందింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 11.3 శాతం పెరిగి రూ.2.68 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం 1,500లకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. టీ–హబ్, టీ–వర్క్స్ వంటి ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌లతో నగరం 4 వేల స్టార్టప్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సెమీకండక్టర్ల డిజైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి పెట్టడంతో అభివృద్ధి మరింత జోరందుకుంటుంది.
లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా పిలిచే హైదరాబాద్‌లో 1,500లకు పైగా ఫార్మాసూటికల్స్, బయోటెక్ కంపెనీలున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా 20–30 శాతం. దేశంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2023–24లో రూ.36,893 కోట్ల ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వచ్చే పదేళ్లలో లైఫ్ సైన్స్ పరిశ్రమ వంద బిలియన్ డాలర్ల అభివృద్ధి చేయాలని, కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మా క్లస్టర్లు, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైస్ పార్క్‌ల విస్తరణ తదితర బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా.. ఇందులో రూ.2,68,233 కోట్లు ఐటీ, రూ.36,893 కోట్ల ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి. నగరంలో ఐటీతో మొదలైన రియల్ బూమ్ ఫార్మా ఎంట్రీతో నెక్ట్స్ లెవల్‌కి చేరింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, వ్యాపార అనుకూల విధానాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, అందుబాటులో ప్రాపర్టీల ధరలు.. ఇవన్నీ ఐటీ, ఫార్మా రంగాలకు చోదక శక్తిగా మారాయి. బహుళ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరడంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో గ్రేటర్ వాటా 60 శాతానికి పైగానే ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్‌తో పాటు పోచారం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, మేడ్చల్, కొత్తూరు, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో వేర్‌హౌస్‌లు, శంషాబాద్, కందుకూరు, మేకగూడ వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment