
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.
‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.
‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్‌టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్
అభిప్రాయపడ్డారు.