
ఇళ్ల లాంచింగ్స్, అమ్మకాల్లో భారీ తగ్గుదల
3 నెలల్లో విక్రయాలు 49 శాతం, ప్రారంభాలు 55 శాతం క్షీణత
అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి
రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్‌లో గృహ విక్రయాలు, లాంచింగ్స్ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్‌లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది.
ఇన్వెంటరీ 5 లక్షలపైనే..
ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.
దేశంలోనూ సేమ్..
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్ క్షీణించాయి.
లగ్జరీదే హవా..
లాంచింగ్స్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ వాటా 12 శాతంగా ఉన్నాయి.
