అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్‌మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్‌లుగా అవతరించాయి. ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.
గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్‌మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్‌గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది.
– సాక్షి, సిటీబ్యూరో
స్కై విల్లాస్ అంటే?
విల్లాలు, అపార్ట్‌మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్‌డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్‌మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్.
ప్రైవసీ, ఆధునిక వసతులు..
ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్‌లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.
స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్‌డెక్‌తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్‌హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
ఎక్కడ వస్తున్నాయంటే?
స్కై విల్లాస్ ధరలు అపార్ట్‌మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.
అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.
ప్రయోజనాలివీ..
» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్‌లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.
» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.
» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్‌మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.
» విల్లామెంట్ కాంప్లెక్స్‌లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.
» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment