సోలారే సోబెటరూ.. | Solar energy offers numerous benefits both for individuals and the environment | Sakshi
Sakshi News home page

సోలారే సోబెటరూ..

Published Sat, Dec 21 2024 2:56 PM | Last Updated on Sat, Dec 21 2024 3:53 PM

Solar energy offers numerous benefits both for individuals and the environment

సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్‌ విద్యుత్‌ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్‌ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్‌ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్‌ విద్యుత్‌ వైపునకు మళ్లింది.

దశాబ్ద కాలంగానే సోలార్‌కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్‌ సెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్‌ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్‌ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్‌లలో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్‌ సెట్‌ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.

సూర్య ఘర్‌ స్కీంతో సబ్సిడీ..

హైదరాబాద్‌ వంటి నగరాల్లో సోలార్‌ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్‌ విద్యుత్‌ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్‌ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్‌ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్‌ స్కీంలో ఒక కిలో వాట్‌ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్‌ల సోలార్‌సెట్‌లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్‌ విధానాన్ని రెసిడెన్షియల్‌ ఏరియాలో, స్కూల్స్, ఫామ్‌ హౌజ్‌లు, రైస్‌మిల్స్‌ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్‌ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్‌ బిల్‌ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు.  

పర్యావరణ హితం.. సోలార్‌ సిస్టం..

విద్యుత్‌ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్‌ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్‌ సోలార్‌ సిస్టమ్‌ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్‌ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్‌ వార్మింగ్‌ పెరగడం, కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్‌ సిస్టమ్‌ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు.  

అంతా లాభమే.. 

– రాధికా చౌదరి, ఫ్రెయర్‌ ఎనర్జీ కోఫౌండర్‌

రాష్ట్రంలో సోలార్‌ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్‌ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్‌ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్‌ సెట్‌ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్‌ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్‌ కరెంట్‌ అంతా లాభమే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement