సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోకాపేటలో ఎకరం భూమికి రూ.100 కోట్లు.. మోకిలాలో గజానికి రూ.1,0,5000 ధర పలికిన విషయం తెలిసిందే. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలోనూ మరో మైలురాయి సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రోనగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
విలాసవంతమైన ఇళ్లలో ఇలా...
హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా, 2023 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర మాత్రమే పెరిగాయి. కరోనా తర్వాత నుంచే లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్‌పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.10,210గా ఉండగా, ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.
రెండోస్థానంలో హైదరాబాద్
ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.3,750గా ఉండగా, ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.4 వేలుగా ఉంది.
మధ్యతరగతిలోనూ మనమే టాప్
ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.6,050లుగా ఉండగా, ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.5,780గా ఉంది.
దేశంలోని సగటు చూస్తే..
2018 నుంచి 2023 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే, విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధిగా నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 2018లో 12,400గా ఉండగా, 2023 నాటికి 15,350కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment