rera Committee
-
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
త్వరలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్థి లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటైన ‘రెరా’కు త్వరలో పూర్తిస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో న్యాయబద్ధమైన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (రెరా)లను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా స్థాయి అధికారి చైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇద్దరు పూర్తిస్థాయి సభ్యులు ఉంటారు. అయితే ‘రెరా’కు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రెరాకు వచ్చే దరఖాస్తుల పరిశీలన, అనుమతులు అన్నీ ఆయన నేతృత్వంలోనే సాగేవి. కాగా రియల్ వెంచర్లు, ఫ్లాట్ల నిర్మాణంలో ‘రెరా’ నిబంధనలకు తిలోదకాలిచ్చి పలు సంస్థలు, రియల్ వ్యాపారులు దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పురపాలక శాఖ ఆసక్తి, అర్హత గల వారి నుంచి చైర్పర్సన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తును ఆహ్వానించింది. ఫిబ్రవరి 17వ తేదీలోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని కోరింది. రెరా వెబ్సైట్, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తుదారులకు అవసరమైన అర్హతలు, వేతనం వివరాలన్నీ ఉన్నాయి. -
నవంబర్ 31 వరకు రేరా గడువు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రేరా)లో నిర్మాణంలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. గడువు తర్వాత రిజిస్ట్రేషన్ చేయని ప్రాజెక్టులపై నిర్మాణ వ్యయంలో 10 శాతాన్ని రేరా అథారిటీ జరిమానాగా విధించనుంది. స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా చట్టం 2017 జనవరి 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్లకు మించి లేదా 8 యూనిట్లకు మించిన గృహ/వాణిజ్య ప్రాజెక్టులు/ లే అవుట్లను తప్పనిసరిగా రేరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. 2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కోసం ప్రభు త్వం నవంబర్ 30 వరకు మూడు నెలల ప్రత్యేక గడువు ఇచ్చింది. గత నెల 31న రేరా అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 269 మంది స్థిరాస్తి వ్యాపారులు, 153 మంది ఏజెంట్లు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. అదే విధంగా నాలుగు స్థిరాస్తి ప్రాజెక్టులకు అనుమతి కోరుతూ దరఖాస్తులు రాగా, వాటిలో రెండు ప్రాజెక్టులను రేరా అథారిటీ ఆమోదించింది. రేరా అథారిటీ వెబ్సైట్ (www.rera. telangana.gov.in)లో ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి నిర్ణీత రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సభ్య కార్యదర్శి, డీటీసీపీ విద్యాధర్ సూచించారు. -
‘రియల్’ మోసాలకు రేరాతో చెక్!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారులు ఇకపై మోసపోవడం ఉండదని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. స్థిరాస్తి వ్యాపారులు, కొనుగోలుదారుల మధ్య వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (రేరా) కృషి చేస్తుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో రేరా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం తీసుకొచ్చిన రేరా చట్టం 2017 జనవరి 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. నాటి నుంచి 500 చదరపు మీటర్లకు మించిన విస్తీర్ణంలో నిర్మాణం ప్రారంభించిన స్థిరాస్తి ప్రాజెక్టులన్నింటినీ బిల్డర్లు తప్పనిసరిగా రేరా ఆథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2017 జనవరి 1 నుంచి నిర్మాణ అనుమతి పొందిన ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు 3 నెలల ప్రత్యేక సమయం ఇస్తున్నాం. రేరా వెబ్సైట్ (www.rera.telan gana.gov.in)లో స్థిరాస్తి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం కొనుగోలుదారులకు అం దుబాటులో ఉంటుంది’’అని తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతులు, నిర్మిత, అమ్మకానికి పెట్టిన వైశాల్యం వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. రేరా అథారిటీకి ఫిర్యాదు చేయండి.. ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న సమాచారాన్ని ప్రతి బిల్డర్ తెలియజేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బిల్డర్లు ప్రతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక ఎస్క్రో బ్యాంకు ఖాతాను తెరిచి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యయ లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కొనుగోలుదారులకు ఏ సమస్య వచ్చినా రేరా ఆథారిటీకి ఫిర్యాదు చేయాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు కోర్టుల్లో వాదనలు విని నిపుణులు తీర్పునిస్తారని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ప్రతి మూడు నెలలకోసారి రేరాకు బిల్డర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2017 జనవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాజెక్టులే రేరా పరిధిలోకి వచ్చినా, అంతకు ముందు ప్రార ంభించిన ప్రాజెక్టుల విషయం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్, రేరా ఆథారిటీ చైర్మన్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ దూకుడు హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగం మంచి దూకుడు మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో స్థిరాస్తి రంగం ఏమవుతుందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, కాని అనుమానాలను తలకిందులు చేస్తూ స్థిరాస్తి రంగం గణనీయ వృద్ధి సాధించిందన్నారు. మరో రెండేళ్లలో హైదరాబాద్.. బెంగళూరును వెనక్కి నెట్టనుందని తెలిపారు. -
నిర్మాణంలోని ప్రాజెక్టులూ రెరా పరిధిలోకే
♦ రెరా కమిటీ ఖరారు; వారం రోజుల్లోగా అమల్లోకి ♦ ఐదేళ్ల వారంటీ నిబంధన నిర్మాణపరమైన లోపాలకే వర్తింపు ♦ వెబ్సైట్లో డెవలపర్ల ఆదాయ పన్ను, బ్యాలెన్స్ షీట్ వివరాలక్కర్లేదు ♦ ప్రభుత్వం విక్రయించే ఫ్లాట్లూ రెరా పరిధిలోకే ♦ కొనుగోలుదారులపై రెరా భారం రూ.1,500 కోట్లు: నిపుణులు దేశమంతా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హడావుడిలో ఉంటే.. భాగ్యనగరి నిర్మాణ సంస్థలకు మాత్రం ప్రభుత్వం స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లు (రెరా) రూపంలో షాకిచ్చింది. నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలో నుంచి మినహాయించాలన్న డెవలపర్ల విన్నపాన్ని తోసిపుచ్చింది. ఐదేళ్ల గ్యారంటీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల వంటి వాటికే ఊరటనిచ్చింది. సాక్షి, హైదరాబాద్ ఎనిమిది ఫ్లాట్లు లేదా 500 చ.మీ.లున్న నివాస, వాణిజ్య సముదాయాలే కాదు లే అవుట్ వెంచర్లూ రెరా పరిధిలోకి వచ్చేస్తాయి. ఇక నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను లేదా కనీసం 50 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిని రెరా నుంచి మినహాయించాల ని నిర్మాణ సంఘాలు రెరా కమిటీని కోరాయి. కానీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లే కాదు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) లేదా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకొని ప్రాజెక్ట్‌లను వేటికీ మినహాయింపునివ్వలేదని, అన్నింటినీ రెరా పరిధి లోకే చేర్చామని’’ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి కార్యదర్శి, రెరా తెలంగాణ కమిటీ అధ్యక్షులు నవీన మిట్టల్ ‘సాక్షి రియల్టీ’తో ఫోన్లో చెప్పారు. అమలు ఎప్పుడనే ప్రశ్నకు సమాధానంగా ‘‘రెరా డ్రాఫ్ట్ కాపీని నోటిఫై చేసేశాం. సంబంధిత మంత్రిత్వ శాఖకూ సమర్పించాం. 7 లేదా 10 రోజుల్లో ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుందని, రెరా అథారిటీని ఏర్పాటు చేసిన వెంటనే రెరా అమల్లోకి వచ్చేస్తుందని’’ ఆయన వివరించారు. డెవలపర్ కూడా కొనుగోలుదారుడే.. డబ్బులు చెల్లించి ఇళ్లు కొనేవారిని ఎలాగైతే కొనుగోలుదారులంటున్నామో.. అలాగే ఇంటిని కట్టేందుకు ఫీజులు, పన్నులు చెల్లిం చే డెవలపర్నూ కొనుగోలుదారుడిగానే భావించాలి. అంటే ఎలా గైతే స్థిరాస్తి కొనుగోలుదారులకు రెరా నిబంధనలున్నాయో.. అదే విధంగా డెవలపర్ల ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించేందుకూ రెరా నిబంధనలు మార్చాలన్న అవసరం ఎంతైనా ఉందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి చెప్పారు. ఉదాహరణకు గడువులోగా నిర్మాణాల పూర్తి విషయాన్నే తీసుకుందాం. ‘‘నాణ్యమైన నిర్మాణాలను, గడువులోగా అప్పగించాలనేది లక్ష్యం. బాగానే ఉంది. కానీ, గడువులోగా నిర్మాణం పూర్తవ్వాలంటే నిర్మాణ అనుమతులూ గడువులోగా రావాలి కదా? కానీ, స్థానిక సంస్థలకు ఏళ్ల పాటు చెప్పులరిగేలా తిరిగినా అనుమతులు రాని పరిస్థితి. ఇక గడువులోగా నిర్మాణాలెలా పూర్తవుతాయి? అందుకే రెరా పరిధి లోకి డెవలపర్లు, నిర్మాణ సంస్థలు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ మాత్రమే కాదు.. స్థానిక సంస్థలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎం డీఏ, డీటీసీపీలను, జలమండలి, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక శాఖ లనూ చేర్చాలి. అప్పుడే అనుమతులూ త్వరగా వస్తాయి.. నిర్మాణాలూ గడువులోగా పూర్తవుతాయని’’ ఆయన వివరించారు. కాంట్రాక్టర్లకు లైసెన్స్.. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కాంట్రాక్టర్లకు మిషనరీ, పనిముట్లు, నిపుణులు, అనుభవం వగైరాలను పర్యవేక్షించి స్థానిక సంస్థలు లైసెన్స్‌లను అందిస్తాయి. దీంతో అనుమతి పొందిన కాంట్రాక్టర్లకు మాత్రమే నిర్మాణ పనులను అప్పగిస్తారు. నిబంధనలను పక్కాగా పాటిస్తాడు. ఏమాత్రం నిబంధనలను ఉల్లంఘించిన సరే లైసెన్స్‌ను రద్దు చేసేస్తుంది. కానీ, మన దగ్గర ఈ విధానం లేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘన, నాసిరకం పనులు వంటివి చేస్తున్నారు. అశ్రద్ధ, రక్షణ ఏర్పాట్లు తీసుకోకపోవటం కారణంగా నిర్మాణ స్థలాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే కాంట్రాక్టర్లు నిర్మాణ సామగ్రి ప్రొవైడర్లనూ రెరా పరిధిలోకి చేర్చితే నిర్మాణంలో నాణ్యత వస్తుంది. రెరా నుంచి నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను మినహాయించకపోవటం వల్ల పాత, కొత్త కస్టమర్లకు ఫ్లాట్ల విక్రయంలో గందరగోళం నెలకొంటుందని తెలంగాణ బిల్డ్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు ప్లింత్ ఏరియా చొప్పున విక్రయించి ప్రాజెక్ట్‌లో రెరా అమల్లోకి వచ్చాక కార్పెట్ ఏరియా ప్రాతిపదికన విక్రయించాలి. ఇక్కడేమవుతుందంటే.. ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్‌లో కొన్ని ఫ్లాట్లు ఏడాదిన్నర క్రితం ప్లింత్ ఏరియా చొప్పున విక్రయించిన డెవలపర్.. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌లో మిగిలిన ఫ్లాట్లను కార్పెట్ ఏరియా చొప్పున విక్రయించాలి గనక ధరలను పెంచేసి విక్రయిస్తాడు. పైగా ప్రాజెక్ట్ మొత్తానికి ఐదేళ్ల గ్యారంటీ, ఇతరత్రా రెరా నిబంధనలూ పాత కస్టమర్‌కూ వర్తిస్తాయి గనక ఆ కస్టమర్‌ను కూడా తాజా రేట్ల ప్రకారం సొమ్ము చెల్లించమని నోటీసు పంపిస్తాడు. అప్పటికే కొనుగోలు చేసేసి.. రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్ డబ్బులు కట్టనని వాదిస్తే మాత్రం డెవలపర్ ఏం చేయలేడు. అయితే కొనుగోలుదారులు సొమ్ము చెల్లించాలి లేదా గ్యారంటీ, ఇతరత్రా హామీలను వదులుకోవాల్సి వస్తుంది. రెరాతో ఎవరికేం లాభమంటే.. పరిశ్రమ: పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టే సంస్థల సంఖ్య పెరుగుతుంది. నిర్మాణ పనుల్లో మునుపటి కంటే మరింత సామర్థ్యం, సకాలంలో ప్రాజెక్ట్‌ను అందజేయటం పెరుగుతుంది. నిర్మాణాల్లో నాణ్యత పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారుల్లో పూర్తి నమ్మకం వస్తుంది. ఫలితంగా అధిక శాతం మంది ఇళ్లు కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు. ప్రతి అంశాన్ని పక్కాగా పాటించే సంస్థలకు కార్పొరేట్ బ్రాండింగ్ ఏర్పడుతుంది. కొనుగోలుదారులు: ఏళ్లకొద్ది సాగే ప్రాజెక్ట్‌ల నుంచి విముక్తి కలుగుతుంది. నిర్మాణాల్లో వేగవంతం కారణంగా గడువులోగా గృహ ప్రవేశాలు చేసే వీలుంటుంది. నాణ్యమైన నిర్మాణాలు అందిస్తుండటం వల్ల సొంతింటికి భరోసా ఏర్పడుతుంది. కొనుగోలు సమయాల్లో డెవలపర్ల ఏకపక్ష ఒప్పందాలు ఉండవు కాబట్టి.. కొనుగోలుదారులు దైర్యంగా ముందడుగేయవచ్చు. కాకపోతే ఇళ్ల తుది ధరలు పెరిగే ప్రమాదముంటుంది. వీటికి మినహాయింపు.. ⇔ ముగిసిన 3 ఆర్ధిక సంవత్సరాల ఆదాయ పు పన్ను రిటర్న్‌లు, చివరి ఆర్థిక సంవత్స రం ఆడిట్ బ్యాలెన్స్ షీట్స్లను వెబ్సైట్లో పొందుపరచాలనే నిబంధనను రెరా కమిటీ తోసిపుచ్చింది. డెవలపర్లు కోరిన విధంగా ఆయా వివరాలను రెరా అథారిటీకి సమర్పిస్తే సరిపోతుందని, వాటి వివరాలు కొనుగోలుదారులకు అవసరం లేదని తేల్చింది. ⇔ ప్రాజెక్ట్‌కు ఐదేళ్ల గ్యారంటీ నిబంధనలోనూ డెవలపర్లకు ఊరట లభించింది. అయితే నిర్మాణ పరమైన లోపాలకు మాత్రం డెవలపర్లనే బాధ్యత వహించాలని, అంతేతప్ప ఇంట్లో వాడే రంగులు, నల్లాలు, శానిటేషన్ ఉత్పత్తులు, విద్యుత్ వైర్లు, ఎలక్ట్రికల్ స్విచ్చులు, టైల్స్, లిఫ్ట్, జనరేటర్ ఇతరత్రా ఉత్పత్తులకు డెవలపర్ బాధ్యుడిని చేయాల్సిన అవసరం లేదని తేల్చింది. రెరా భారం రూ.1500 కోట్లు.. కార్పెట్ ఏరియా చొప్పున విక్రయం, ఐదేళ్ల గ్యారంటీ, ఇతరత్రా రెరాలోని నిబంధనల కారణంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయని, సుమారు రూ.200–250 వరకు పెరిగే అవకాశముందని శేఖర్ రెడ్డి చెప్పారు. నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను మినహాయించకపోవటం వల్ల కొనుగోలుదారులపై ఎంత భారం పడుతుందనేది గణాంకాల్లో వివరించారాయన. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మాణంలో సురుగా 30–40 వేల వరకుంటాయి. వీటిని చ.అ.ల్లో తీసుకుంటే 6 కోట్లు చ.అ. ( సగటు 1,500 చ.అ.). రెరాతో చ.అ.కు రూ.250 వరకు పెరిగితే రూ.1500 కోట్లన్నమాట. ఈ భారమంతా కొనుగోలుదారుల మీదే పడుతుంది. ప్రభుత్వం విక్రయించే ఫ్లాట్లూ రెరా పరిధిలోకే కేవలం ప్రైవేట్ నిర్మాణ సంస్థలు నిర్మించే ప్రాజెక్ట్‌లే కాదు ప్రభుత్వం విక్రయించే ఫ్లాట్లు కూడా రెరా పరిధిలోకే వచ్చేస్తాయి. రాజీవ్ స్వగృహ, గృహకల్ప వంటి ప్రాజెక్ట్లన్నమాట. అంటే రెరా అమలుతో వీటి ధరలూ పెరుగుతాయన్నమాట. ప్రైవేట్ డెవలపర్ల విషయానికొస్తే.. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే మొత్తంలో 70 శాతం సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థలం కొనుగోలు దగ్గర్నుంచి నిర్మాణ పనులు చేపట్టే వరకూ నిర్మాణ సంస్థలే సొంత నిధుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలు సొంత సొమ్ము, బయటి అప్పుల మీదే ప్రాజెక్టుల పనులు చేపడతాయి కాబట్టి.. వాటిపై కట్టే వడ్డీలు, పెరిగిన నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుంటే రానున్న రోజుల్లో ఫ్లాట్ల ధరలు పెంచే ప్రమాదమూ ఉందండోయ్!