
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రేరా)లో నిర్మాణంలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. గడువు తర్వాత రిజిస్ట్రేషన్ చేయని ప్రాజెక్టులపై నిర్మాణ వ్యయంలో 10 శాతాన్ని రేరా అథారిటీ జరిమానాగా విధించనుంది. స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా చట్టం 2017 జనవరి 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్లకు మించి లేదా 8 యూనిట్లకు మించిన గృహ/వాణిజ్య ప్రాజెక్టులు/ లే అవుట్లను తప్పనిసరిగా రేరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది.
2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కోసం ప్రభు త్వం నవంబర్ 30 వరకు మూడు నెలల ప్రత్యేక గడువు ఇచ్చింది. గత నెల 31న రేరా అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 269 మంది స్థిరాస్తి వ్యాపారులు, 153 మంది ఏజెంట్లు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. అదే విధంగా నాలుగు స్థిరాస్తి ప్రాజెక్టులకు అనుమతి కోరుతూ దరఖాస్తులు రాగా, వాటిలో రెండు ప్రాజెక్టులను రేరా అథారిటీ ఆమోదించింది. రేరా అథారిటీ వెబ్‌సైట్ (www.rera. telangana.gov.in)లో ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి నిర్ణీత రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సభ్య కార్యదర్శి, డీటీసీపీ విద్యాధర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment