
భారత రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి వీలుగా.. కార్యకలాపాల్లో విశ్వాసం, పారదర్శకత ఉండేలా చూడాలని ఈ రంగానికి చెందిన ఏజెంట్లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూచించారు. 2030 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.85 లక్షల కోట్లకు చేరుకోనుందన్న అంచనాను ప్రకటించారు.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (నార్–ఇండియా) వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలను, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమను కోరారు. నార్–ఇండియాలో 50వేల మంది ఏజెంట్లు సభ్యులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో ఏజెంట్ల పాత్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
డెవలపర్లు, వినియోగదారుల మధ్య వీరు కీలక వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏజెంట్ల సూచలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. 2016లో రెరాను తీసుకురావడాన్ని అద్భుత సంస్కరణగా పేర్కొన్నారు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాల నివారణకు దీన్ని తీసుకొచ్చారు.
అలాగే, రియల్ ఎస్టేట్‌లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, వ్యాపార సులభతర నిర్వహణకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. 2047 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే నివసించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇది 35 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment