
మెట్రో నగరాల్లో గృహ కొనుగోలులో వంట గది కీలకంగా మారింది. అందుబాటు ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, వసతులు మాత్రమే కాదండోయ్.. ఇంట్లోని వంట గది శైలి కూడా ఆధునికంగా ఉండాలంటున్నారు కొనుగోలుదారులు. అందుకే సాధారణ కిచెన్స్ స్థానంలో ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. లివింగ్, డైనింగ్ రూమ్‌లతో వంట గది కలిసి ఉండటమే దీని ప్రత్యేకత! – సాక్షి, సిటీబ్యూరో
నగరంలోని నిర్మాణ సంస్థలు 1,000 చ.అ.పైన ఉండే ప్రతి ఫ్లాట్‌లోనూ ఓపెన్ కిచెన్ ఏర్పాటుకే ప్రాధాన్యమిస్తున్నాయి. హాలుకు అనుసంధానంగా అడ్డుగా గోడలు లేకుండా ఓపెన్ కిచెన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌కు కిచెన్ కలిసే ఉంటుందన్నమాట.
ముచ్చటిస్తూ వంటలు..
» ఓపెన్ కిచెన్స్‌లో సానుకూల, ప్రతికూల రెండు రకాల అంశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
» వంట చేస్తూనే ఇతర గదుల్లో ఉన్నవారితో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించవచ్చు. హాల్‌లో ఉండే టీవీలోని కార్యక్రమాలనూ వీక్షించొచ్చు.
» ఓపెన్ కిచెన్ కాబట్టి శుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించే కసరత్తును వంట గది నుంచి మొదలుపెడతారు.
» ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి. దీంతో కుటుంబ సభ్యుల మూడ్‌ను మారుస్తాయి.
» ఇంట్లో చిన్నారులు ఉంటే వంట గది నుంచి కూడా వీరిపై
పర్యవేక్షణకు వీలుంటుంది.
» వంట పాత్రలు బయటకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది
కొందరికి నచ్చకపోచ్చు.
» డిష్‌వాషర్, మిక్సీల శబ్ధాలు ఇతర గదుల్లోకి వినిపించి అసౌకర్యంగా ఉంటుంది.
» దూరపు బంధువులు, అంతగా పరిచయం లేనివారు వచ్చినప్పుడు వారి ముందు వంట చేయడం కొంత మందికి అంతగా నచ్చకపోవచ్చు.
సంప్రదాయ వంటగది:
» వీటిని పాత రోజుల నుంచి చూస్తున్నవే.. వంట గది ప్రత్యేకంగా ఉంటుంది. ఏకాంతంగా వంట చేయాలని కోరుకునే వారు సంప్రదాయ శైలిలో ఉండే వంటిల్లునే ఇష్టపడతారు.
» గదికి అన్ని వైపులా గోడలుంటాయి. అరలు ఎక్కువ ఏర్పాటుకు వీలుండటంతో పాత్రలన్నింటినీ చక్కగా సర్దేయవచ్చు.
» వంటింట్లోని శబ్ధాలు, వాసనలు బయటకు రావు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
» చుట్టూ గోడలు ఉండటంతో ఇరుగ్గా, చీకటిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది తిరిగేందుకు వీలుండదు.
» ఇల్లు డిజైన్ సమయంలోనే ఎలాంటి వంట గది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంట గదిని నిర్మించేశాక మళ్లీ ఓపెన్ కిచెన్‌లా మార్చాలంటే మరింత ఖర్చు అవుతుంది.