బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మైనారిటీలపై హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న దరిమిలా పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతోంది.
బంగ్లాదేశీయుల చొరబాట్లపై పోలీసులు దృష్టి
మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల(Bangladeshi)పై పోలీసులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రేట్ కార్డును కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్‌లోకి మూడు రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉందని పోలీసులు గుర్తించారు.
15 ఏళ్లుగా అక్రమ నివాసం
ముంబైలో మైనారిటీలు అధికంగా ఉన్న గోవండి, శివాజీ నగర్, మన్‌ఖుర్డ్ డియోనార్, చునాభట్టి, ఘట్‌కోపర్‌లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల(Bangladeshi infiltrators)ను పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ నవనాథ్ ధావలే తెలిపారు. ఈ చొరబాటుదారులలో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్రాలలో ఆధార్‌కార్డు
అయితే ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు ఐదువేల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేసి, వారికి నకిలీ పత్రాలు రూపొందించి, వాటి ఆధారంగా ఆధార్ కార్డు తయారు చేయిస్తున్నారని తేలింది. కాగా వీరంతా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారా లేక వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను 1994 నుండి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిని అరెస్టు చేసి విచారిస్తున్న సందర్భంలో అతను భారతదేశంలో చొరబడేందుకు ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలియజేసే రేటు కార్డు బయటపడింది.
మూడు రూట్లు.. వివిధ రేట్లు
మాల్దా, 24 పరగణాలు, ముర్షిదాబాద్, దినేష్‌పూర్, చప్లీ నవాబాద్‌గంజ్ తదితర ప్రాంతాల నుంచి పలువులు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు(Mumbai Crime Branch sources) తెలిపాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7 వేల నుంచి 8 వేలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాల్లో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఏజెంట్లలో ఉంది. బంగ్లాదేశీయులు నీటి మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలంటే, ఇందుకోసం రెండు నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి. ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేటు తక్కువ విధించారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్‌లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12 వేల నుంచి 15 వేలు ఏజెంట్లకు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలుసుకున్నారు.
బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు.
ఇది కూడా చదవండి: కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment