illegal entry
-
‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మైనారిటీలపై హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న దరిమిలా పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతోంది.బంగ్లాదేశీయుల చొరబాట్లపై పోలీసులు దృష్టిమహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల(Bangladeshi)పై పోలీసులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రేట్ కార్డును కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్‌లోకి మూడు రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉందని పోలీసులు గుర్తించారు.15 ఏళ్లుగా అక్రమ నివాసంముంబైలో మైనారిటీలు అధికంగా ఉన్న గోవండి, శివాజీ నగర్, మన్ఖుర్డ్ డియోనార్, చునాభట్టి, ఘట్కోపర్లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల(Bangladeshi infiltrators)ను పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ నవనాథ్ ధావలే తెలిపారు. ఈ చొరబాటుదారులలో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నకిలీ పత్రాలలో ఆధార్కార్డుఅయితే ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు ఐదువేల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేసి, వారికి నకిలీ పత్రాలు రూపొందించి, వాటి ఆధారంగా ఆధార్ కార్డు తయారు చేయిస్తున్నారని తేలింది. కాగా వీరంతా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారా లేక వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను 1994 నుండి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిని అరెస్టు చేసి విచారిస్తున్న సందర్భంలో అతను భారతదేశంలో చొరబడేందుకు ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలియజేసే రేటు కార్డు బయటపడింది.మూడు రూట్లు.. వివిధ రేట్లుమాల్దా, 24 పరగణాలు, ముర్షిదాబాద్, దినేష్పూర్, చప్లీ నవాబాద్గంజ్ తదితర ప్రాంతాల నుంచి పలువులు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు(Mumbai Crime Branch sources) తెలిపాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7 వేల నుంచి 8 వేలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాల్లో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఏజెంట్లలో ఉంది. బంగ్లాదేశీయులు నీటి మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలంటే, ఇందుకోసం రెండు నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి. ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేటు తక్కువ విధించారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్‌లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12 వేల నుంచి 15 వేలు ఏజెంట్లకు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలుసుకున్నారు.బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం -
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 97 వేల మంది భారతీయులు పట్టివేత
వాషింగ్టన్: 2022 అక్టోబర్–2023 సెప్టెంబర్ కాలంలో అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 96,917 మంది భారతీయులు పట్టుబడినట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూసీబీపీ) తెలిపింది. ఇటీవల అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య అయిదు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2019–20లో 19,883 మంది పట్టుబడగా ఈ సంఖ్య 2020–21లో 30,662కు చేరిందని, 2021–22లో 63, 927కు పెరిగిందని వివరించింది. 2022 అక్టోబర్–2023 సెప్టెంబర్ మధ్యన దొరికిపోయిన వారిలో కెనడా సరిహద్దుల్లో 30,010 మంది, మెక్సికో సరిహద్దుల్లో మరో 41,770 మంది ఉన్నారని తెలిపింది. యువత అత్యధికంగా 84 వేల మంది వరకు ఉన్నట్లు పేర్కొంది. ఒంటరిగా వచ్చి మరో 730 మంది మైనర్లు కూడా ఉన్నట్లు వివరించింది. -
‘తీరం’పైనా ఇస్రో డేగ కన్ను!
సాక్షి, అమరావతి: దేశ తీరప్రాంత భద్రతకు నేను సైతం అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు నేవీ, కోస్ట్ గార్డ్లకు ఉపగ్రహ పరిజ్ఞానాన్ని అందించేందుకు సన్నద్ధమైంది. ప్రధానంగా మత్స్యకారుల భాగస్వామ్యంతో తీరప్రాంతం నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు తెలపడానికి కూడా ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఏపీతో సహా దేశంలోని 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మత్స్యకారుల బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటునకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇస్రోకు చెందిన ‘న్యూ స్పేస్ ఇండియా’ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్(ఎంఎస్ఎస్) పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. మొదటి దశలో దేశంలో లక్ష మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ డయ్యూలలోని మత్స్యకార బోట్లపై వాటిని ఏర్పాటు చేస్తారు. పొడవైన తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల బోట్లపై వాటిని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఈ 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీరప్రాంత సమీపంలో ఇస్రో ప్రత్యేకంగా 9ఎం/11ఎం సి–బాండ్ గ్రౌండ్ స్టేషన్లను హబ్ బేస్‌బాండ్ వ్యవస్థతో ఏర్పాటు చేస్తారు. అనంతరం మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ మత్స్యకార బోట్లను ఆయా రాష్ట్రాల గ్రౌండ్ స్టేషన్లతో అనుసంధానిస్తారు. ఇస్రో ఇటీవల ప్రయోగించిన నావిక్ ఉపగ్రహ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. దీంతో మన దేశ మత్స్యకార బోట్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషన్‌లోని మానిటర్ ద్వారా పర్యవేక్షించొచ్చు. పరస్పర సమాచార మార్పిడికి అవకాశం ఎంఎస్ఎస్ ప్రాజెక్టు అటు భద్రత బలగాలకు, ఇటు మత్స్యకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు రెండు వైపుల నుంచి సమాచార మార్పిడికి అవకాశం కల్పిస్తుంది. అంటే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లలో ఉన్న మత్స్యకారులు, ఒడ్డున ఉన్న గ్రౌండ్ స్టేషన్‌లోని అధికారులు పరస్పరం సంభాషించుకోవచ్చు. సముద్రంలో అక్రమ చొరబాటుదారులుగానీ అనుమానాస్పద కదలికలను గానీ గమనిస్తే మత్స్యకారులు వెంటనే గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులకు సమాచారం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు వంటి సమాచారాన్ని సముద్రంలో ఉన్న మత్స్యకారులకు ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుంటుంది. పొరుగు దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా అప్రమత్తం చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌పై తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిస ఇస్రో త్వరలోనే మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. -
హృదయవిదారకం.. భారతీయ కుటుంబం దుర్మరణం!
న్యూయార్క్/ఒట్టావా: కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటుచేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్‌కు చెందినవాళ్లూ, అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తిని కెనడా పౌరసత్వం ఉన్న రోమేనియన్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. ఇరు దేశాల మధ్య అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు-క్యూబెక్(న్యూయార్క్ స్టేట్) ప్రాంతంలో సెయింట్ లారెన్స్ నదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు అంతా భారతీయులేనా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం నదీ తీర ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ బోటును అధికారులు గుర్తించారు. ఆపై ఏరియల్ సర్వే ద్వారా మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికితీశారు. మరో చిన్నారికి చెందిన పాస్‌పోర్ట్ లభ్యం కాగా ఆమె కూడా చనిపోయి ఉంటుందని అంచనాకి వచ్చిన పోలీసులు.. మృతదేహం కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇది హృదయవిదారకమైన ఘటన. మృతుల్లో పసికందులు కూడా ఉండడం ఘోరం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఇక జనవరి నుంచి ఇప్పటిదాకా అక్రమంగా ఇరు దేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు 48 వెలుగు చూసినట్లు అక్వెసాస్నే అధికారులు చెబుతున్నారు. వీళ్లలో భారత్‌కు, రొమేనియాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. మోహవ్క్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అక్వెసాస్నే.. క్యూబెక్, ఒంటారియో, న్యూయార్క్ స్టేట్లతో సరిహద్దు పంచుకుంటోంది. అందుకే వీటి గుండా ఇరు దేశాలకు శరణార్థుల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటోంది. పైగా ఈ అక్రమ రవాణాకు పోలీసులే సహకరిస్తుండడం గమనార్హం. సరిహద్దుల్లో దిగాక.. వాళ్లకు గోప్యంగా వాహనాల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇదీ చదవండి: నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు! -
IELTS Row: అడ్డంగా దొరికిపోయి భారత్ పరువు తీశారు!
అహ్మదాబాద్: అగ్రరాజ్యం గడ్డపై భారత్ పరువు పోయిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు ప్రయత్నించడంతో పాటు కోర్టులో ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. దీంతో అమెరికా నేరవిభాగం ఆదేశాలతో.. ఐఈఎల్టీఎస్ పరీక్ష అవకతవకలపై గుజరాత్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల కిందట.. అమెరికా-కెనడా సరిహద్దులో అక్వేసాసేన్ వద్ద సెయింట్ రెగిస్ నదిలో మునిగిపోతున్న ఓ పడవ నుంచి కొందరిని అమెరికా సిబ్బంది రక్షించారు. అందులో ఆరుగురు భారత విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ ఆరుగురు జడ్జి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు. దీంతో అప్పటికప్పుడు ఓ హిందీ ట్రాన్స్‌లేటర్ సాయంతో కోర్టు వాళ్ల నుంచి వాంగ్మూలం సేకరించింది. ► కెనడా నుంచి వాళ్లు అక్రమంగా అమెరికాలోకి చొరబడాలని ప్రయత్నించినట్లు తేలింది. అయితే ఐఈఎల్‌టీఎస్‌లో వీళ్లు 6.5 నుంచి 7 మధ్య స్కోర్ చేశారని తెలియడంతో కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ముంబైలోని అమెరికా క్రిమినల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. దర్యాప్తు చేపట్టాల్సిందిగా మెహ్సనా(గుజరాత్) పోలీసులకు మెయిల్ చేసింది. ► ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS.. ఇంగ్లీష్ సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్ష. చాలా దేశాల్లో మంచి కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షలో మంచి స్కోర్ అవసరం కూడా. అయితే.. ► భారతీయ విద్యార్థుల అక్రమ చొరబాటు వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భిన్న చర్చ నడిచింది. జుగాద్ కల్చర్ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. పరీక్షలో మోసం చేసి న్యూజెర్సీ దాకా వెళ్లి మరీ భారత దేశ పరువు తీశారని, మరికొందరు విద్యార్థుల ప్రయత్నాలపై ఇది ప్రభావం చూపెడుతుందని అంటున్నారు. ► విద్యార్థులంతా 19 నుంచి 21 ఏళ్లలోపు వాళ్లే. వారిలో నలుగురు దక్షిణ గుజరాత్ నవసారీ టౌన్లో సెప్టెంబర్ 25, 2021లో పరీక్ష రాశారని పోలీసులు ధృవీకరించారు. స్టూడెంట్ వీసా మీద మార్చి 19న కెనడాకు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందారు. ఆపై అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తూ.. రెండు వారాల కిందట యూఎస్-కెనడా సరిహద్దులో అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈ ఘటనపై గుజరాత్ పోలీసులు స్పందించారు. IELTS పరీక్ష జరిగిన రోజున.. నవసారీ టౌన్‌లోని ఎగ్జామ్ సెంటర్లోని సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్‌లో ఉన్నాయని స్థానిక అధికారి రాథోడ్ తెలిపారు. విచారణలో భాగంగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఏజెన్సీ నిర్వాహకులను సైతం పిలిపించుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ రాకెట్ గుట్టువీడడంతో మరో మూడు కేంద్రాలను సైతం పరీలిస్తున్నారు కూడా. -
అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం
వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 68 మంది భారతీయులను పట్టుకున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. వీరిలో చాలా మంది పంజాబ్‌కు చెందిన వారు. వాషింగ్టన్‌లోని సియాటల్ నుంచి దేశంలోకి చొరబడుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ టకోమాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచారు. వీరిలో సగం మందిని గత నెలలో అరెస్ట్ చేశారని నార్త్ అమెరికా పంజాబ్ సంఘం డెరైక్టర్ సత్నామ్ సింగ్ చెప్పారు. పాస్‌పోర్ట్, వీసా రాకపోవడంతో వారు అక్రమంగా అమెరికాకు చేరుకున్నట్లు వివరించారు.