సాక్షి, అమరావతి: దేశ తీరప్రాంత భద్రతకు నేను సైతం అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు నేవీ, కోస్ట్ గార్డ్‌లకు ఉపగ్రహ పరిజ్ఞానాన్ని అందించేందుకు సన్నద్ధమైంది. ప్రధానంగా మత్స్యకారుల భాగస్వామ్యంతో తీరప్రాంతం నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు తెలపడానికి కూడా ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది.
ఏపీతో సహా దేశంలోని 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మత్స్యకారుల బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటునకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇస్రోకు చెందిన ‘న్యూ స్పేస్ ఇండియా’ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్(ఎంఎస్‌ఎస్) పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. మొదటి దశలో దేశంలో లక్ష మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ డయ్యూలలోని మత్స్యకార బోట్లపై వాటిని ఏర్పాటు చేస్తారు. పొడవైన తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల బోట్లపై వాటిని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఈ 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీరప్రాంత సమీపంలో ఇస్రో ప్రత్యేకంగా 9ఎం/11ఎం సి–బాండ్ గ్రౌండ్ స్టేషన్లను హబ్ బేస్‌బాండ్ వ్యవస్థతో ఏర్పాటు చేస్తారు.
అనంతరం మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ మత్స్యకార బోట్లను ఆయా రాష్ట్రాల గ్రౌండ్ స్టేషన్లతో అనుసంధానిస్తారు. ఇస్రో ఇటీవల ప్రయోగించిన నావిక్ ఉపగ్రహ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. దీంతో మన దేశ మత్స్యకార బోట్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషన్లోని మానిటర్ ద్వారా పర్యవేక్షించొచ్చు.
పరస్పర సమాచార మార్పిడికి అవకాశం
ఎంఎస్‌ఎస్ ప్రాజెక్టు అటు భద్రత బలగాలకు, ఇటు మత్స్యకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు రెండు వైపుల నుంచి సమాచార మార్పిడికి అవకాశం కల్పిస్తుంది. అంటే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లలో ఉన్న మత్స్యకారులు, ఒడ్డున ఉన్న గ్రౌండ్ స్టేషన్లోని అధికారులు పరస్పరం సంభాషించుకోవచ్చు.
సముద్రంలో అక్రమ చొరబాటుదారులుగానీ అనుమానాస్పద కదలికలను గానీ గమనిస్తే మత్స్యకారులు వెంటనే గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులకు సమాచారం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు వంటి సమాచారాన్ని సముద్రంలో ఉన్న మత్స్యకారులకు ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుంటుంది.
పొరుగు దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా అప్రమత్తం చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌పై తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిస ఇస్రో త్వరలోనే మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment