Coastal security
-
‘తీరం’పైనా ఇస్రో డేగ కన్ను!
సాక్షి, అమరావతి: దేశ తీరప్రాంత భద్రతకు నేను సైతం అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు నేవీ, కోస్ట్ గార్డ్లకు ఉపగ్రహ పరిజ్ఞానాన్ని అందించేందుకు సన్నద్ధమైంది. ప్రధానంగా మత్స్యకారుల భాగస్వామ్యంతో తీరప్రాంతం నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు తెలపడానికి కూడా ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఏపీతో సహా దేశంలోని 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మత్స్యకారుల బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటునకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇస్రోకు చెందిన ‘న్యూ స్పేస్ ఇండియా’ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్(ఎంఎస్ఎస్) పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. మొదటి దశలో దేశంలో లక్ష మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ డయ్యూలలోని మత్స్యకార బోట్లపై వాటిని ఏర్పాటు చేస్తారు. పొడవైన తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల బోట్లపై వాటిని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఈ 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీరప్రాంత సమీపంలో ఇస్రో ప్రత్యేకంగా 9ఎం/11ఎం సి–బాండ్ గ్రౌండ్ స్టేషన్లను హబ్ బేస్‌బాండ్ వ్యవస్థతో ఏర్పాటు చేస్తారు. అనంతరం మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ మత్స్యకార బోట్లను ఆయా రాష్ట్రాల గ్రౌండ్ స్టేషన్లతో అనుసంధానిస్తారు. ఇస్రో ఇటీవల ప్రయోగించిన నావిక్ ఉపగ్రహ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. దీంతో మన దేశ మత్స్యకార బోట్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషన్‌లోని మానిటర్ ద్వారా పర్యవేక్షించొచ్చు. పరస్పర సమాచార మార్పిడికి అవకాశం ఎంఎస్ఎస్ ప్రాజెక్టు అటు భద్రత బలగాలకు, ఇటు మత్స్యకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు రెండు వైపుల నుంచి సమాచార మార్పిడికి అవకాశం కల్పిస్తుంది. అంటే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లలో ఉన్న మత్స్యకారులు, ఒడ్డున ఉన్న గ్రౌండ్ స్టేషన్‌లోని అధికారులు పరస్పరం సంభాషించుకోవచ్చు. సముద్రంలో అక్రమ చొరబాటుదారులుగానీ అనుమానాస్పద కదలికలను గానీ గమనిస్తే మత్స్యకారులు వెంటనే గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులకు సమాచారం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు వంటి సమాచారాన్ని సముద్రంలో ఉన్న మత్స్యకారులకు ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుంటుంది. పొరుగు దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా అప్రమత్తం చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌పై తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిస ఇస్రో త్వరలోనే మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. -
తీర భద్రతకు ‘విగ్రహ’
సాక్షి, విశాఖపట్నం: భారత తీరగస్తీదళం అమ్ముల పొదిలో మరో అధునాతన నౌక చేరుతోంది. అడ్వాన్స్డ్ ఫైర్ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకను శనివారం చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన విగ్రహని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ నౌక కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వర్తించనుంది. ఐసీజీఎస్ విగ్రహ చేరడం ద్వారా కోస్ట్‌గార్డ్ జాబితాలో నౌకల సంఖ్య 157కు చేరుతుంది. కోస్ట్‌గార్డ్‌కు 66 విమానాలున్నాయి. అధునాతన సాంకేతికత విగ్రహ నౌకలో అధునాతన సాంకేతిక వసతులున్నాయి. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్‌తో ఉంది. దీని బరువు 2,200 టన్నులు. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లున్నాయి. 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశను మార్చుకునే యంత్ర సామర్థ్యం దీని సొంతం. 40/60 బోఫోర్స్ గన్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌తో 12.7 మిల్లీమీటర్ల స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్లు రెండు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లు తీసుకెళ్లగలదు. సముద్రంలో చమురుతెట్టు వంటి కాలుష్యాల నియంత్రణకు స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉంది. -
మచిలీపట్నంలో జాతీయ మెరైన్ అకాడమీ
* వైజాగ్, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఆక్టోపస్ హబ్స్ * రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఏపీఎస్పీ బెటాలియన్లు * స్థల సేకరణకు ‘రెవెన్యూ’తో సంప్రదింపులు * విస్తృత సమీక్ష నిర్వహించిన డీజీపీ రాముడు సాక్షి, హైదరాబాద్: తీరప్రాంత భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం ఆ విభాగంలో సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతీయ మెరైన్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుబాటులో ఉన్న రూ.9.6 కోట్లను వినియోగించి ప్రస్తుతం ఉన్న మెరైన్ పోలీసుస్టేషన్లకు అదనంగా మరికొన్ని నిర్మించడంతోపాటు జెట్టీల కొనుగోలుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. వీటికి అవసరమైన స్థలం గుర్తింపు, సమీకరణ తదితర అంశాలకు కీలక ప్రాధాన్యం ఇస్తూ వీలైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తోంది. కొత్త రాష్ట్రంలో పోలీసు విభాగం పునర్ నిర్మాణానికి సంబంధించి మంగళవారం డీజీపీ జాస్తి వెంకట రాముడు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం అందించాల్సిన నిధులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చించేందుకు త్వరలో ఓ బృందం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ్ళ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎనిమిది ఏపీఎస్పీ బెటాలియన్లకు తోడు మరో ఆరింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధానిగా మారుతున్న విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం సహా మరో జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న స్పెషల్ ఆర్డ్మ్ రిజర్వ్ సెంట్రల్ పోలీసు లైన్స్ (ఎస్ఏఆర్ సీపీఎల్) విభజనకు కసరత్తు ప్రారంభించనున్నారు. ్ళ ఒడిశాలో ఉన్న విపత్తు నిర్వహణ బృందాల (ఓడీఆర్ఏఎఫ్) మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయనున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్)కు ఆధునిక పరికరాలు అందించాలని నిర్ణయించారు. దీనికోసం జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓడీఆర్ఏఎఫ్ వినియోగిస్తున్న వాటిని పరిశీలించనున్నారు. విశాఖ, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఆక్టోపస్, గ్రేహౌండ్స్ హబ్స్‌తో పాటు ఏపీఎస్పీ బెటాలియన్లు, మెరైన్ అకాడమీ తదితరాలు అవసరమైన భూముల గుర్తింపు, సేకరణ కోసం రెవెన్యూ విభాగంతో జిల్లాల వారీగా సంప్రదింపులు జరుపనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని వసతుల్నీ గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ్ళ సీఐడీ దర్యాప్తులో ఉన్న చిట్‌ఫండ్ సంబంధిత నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు బాధితులకు ఊరట లభించేలా నిందితుల ఆస్తుల గుర్తింపు, స్వాధీనం తక్షణం చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. -
మూలన పడిన గస్తీ స్టీమర్లు
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలో మారణహోమం సృష్టించి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ తీర ప్రాంత భద్రతపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. తీర ప్రాంతాల వెంబడి గస్తీ నిర్వహించేందుకు ముంబై, ఠాణే పోలీసుల ఆధీనంలో ఉన్న 27 స్టీమర్లలో 18 మరమ్మతులకు లోనై ఒడ్డ్డుపై లంగరు వేసి ఉన్నాయి. పనిచేస్తున్న కొద్దిపాటి స్టీమర్లకూ తగినంత ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో సముద్రంలో పూర్తిగా గస్తీ నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న అనేక పోస్టులు మంజూరైనప్పటికీ వాటిని భర్తీ చే యడంలేదు. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే సేకరించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు దాడులుచేసి దాదాపు 200 మంది అమాయకులను హతమార్చారు. ఉగ్రవాదులంతా సముద్రమార్గం మీదుగా నగరంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో తీర ప్రాంతాల వెంబడి గస్తీ మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అందుకు 27 ఆధునిక స్టీమర్లు, గస్తీ పడవలు కొనుగోలు చేసింది. కాని ప్రభుత్వ ఉదాసీనతవల్ల అందులో 18 పనిచేయకుండా పోయాయి. ఇదిలాఉండగా ఈ స్టీమర్ల హాల్టు కోసం నగరంలో మడ్ ఐ ల్యాండ్, బాంద్రా, కఫ్ పరేడ్, గీత్నగర్ (ససూన్ డాక్) వద్ద సముద్రం ఒడ్డున ప్లాట్‌ఫాం(జెట్టి)లు నిర్మించాలని ప్రతిపాదించారు. మెరీటైం బోర్డు సమర్పించిన రూ.27 కోట్ల ఖర్చుతో కూడిన ఈ ప్రతిపాదన అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) వద్ద 2009 నుంచి అలాగే ఉంది. కాగా దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై నగర తీర ప్రాంతాల వెంబడి చమురు శుద్ధి కేంద్రాలు, బీఏఆర్సీ, జేఎన్పీటీ, చమురు బావులు ఇలా అనేక కీలక సంస్థలు ఉన్నాయి. ముంబై, రాయ్‌గఢ్, ఠాణే వెంబడి 117 కి.మీ. తీరప్రాంతం ఉంది. అయితే ప్రస్తుతం ఈ తీర ప్రాంత భద్రత కేవలం తొమ్మిది స్టీమర్లపై ఆధారపడి ఉండటం శోచనీయం. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ గస్తీ నౌకల పరిస్థితి దుర్భరంగా ఉంది. గేర్ బాక్స్ మరమ్మతులు, అయిల్, వాటర్ లీకేజీ, స్టార్టింగ్ ట్రబుల్, ఇంజిన్ ఆగిపోవడం, స్టీరింగ్ జాం తదితర అనేక సమస్యలతో ఒడ్డున పడి ఉన్న 18 నౌకల నిర్వహణ బాధ్యతలు ఏ సంస్థకూ అప్పగించకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్టీమర్ల కొరతవల్ల భద్రతా సిబ్బంది పూర్తిగా గస్తీ నిర్వహించలేకపోతున్నారు. తీరప్రాంతాల భద్రతను గాలికి వదిలేయడంతో ఉగ్రవాదులు మళ్లీ నగరంలో చొరబడే అవకాశాలు లేకపోలేదు. టోల్‌నాకాల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి పారిపోతే వారి ఆనవాళ్లు గుర్తించడం కూడా కష్టతరం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తీర ప్రాంత పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. కాని దీనిపై ఇంతవరకు ఎలాంటి కదలికలు మొదలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 800 ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న నౌకలు కూడా ఆగుతాయి. ఇలాంటివి ముంబైలో దాదాపు 60 ఉన్నాయి. కాని భద్రతా సిబ్బంది కొరతవల్ల ఈ పాయింట్ల వద్ద తగినంత సిబ్బందిని నియమించలేకపోతున్నారు. ఇటీవల నిర్వహించిన మాక్ డ్రిల్‌లో కూడా ఈ అంశం స్పష్టమైంది. 2007-2010 మధ్య కాలవ్యవధిలో తీర ప్రాంతాల భద్రత కోసం మంజూరు చేసిన రూ.590 కోట్లలో కేవలం రూ.325 కోట్లే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదిలా వుండగా ఇంధనం కోసం తగినన్ని నిధులు ఇవ్వడం లేదు. 2009 ఏప్రిల్ నుంచి 2012 డిసెంబరు వరకు పెట్రోల్ కోసం రూ.2,57,46,476 ఖర్చయ్యాయి. అంటే రోజుకు రూ.25,592 విలువైన పెట్రోల్ మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదే కాలంలో డీజిల్ కోసం రూ.98,95,596 ఖర్చుకాగా రోజుకు రూ.9,836 డీజిల్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు స్పష్టమైతోంది. ఈ గణాంకాలను బట్టి సరాసరిగా ఒక్కో గస్తీ నౌకకు 17-23 లీటర్ల ఇంధనం మాత్రమే సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ ఇంధనంతో గస్తీ ఎన్ని ట్రిప్పులు కొట్టాలనే ప్రశ్న పోలీసులను వేధిస్తోంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం గస్తీకి వెళ్లే టప్పుడు ఒక్కో నౌకలో ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉండాలి, కాని సిబ్బంది కొరతవల్ల అవసరాన్ని బట్టి సిబ్బందిని పంపిస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో తీరప్రాంతాల్లో గస్తీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 2008 నవంబరు సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిబ్బందితోపాటు ఒడ్డున పడి ఉన్న గస్తీ నౌకల మరమ్మతులు, ఇంధనం సరఫరా మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.