సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలో మారణహోమం సృష్టించి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ తీర ప్రాంత భద్రతపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. తీర ప్రాంతాల వెంబడి గస్తీ నిర్వహించేందుకు ముంబై, ఠాణే పోలీసుల ఆధీనంలో ఉన్న 27 స్టీమర్లలో 18 మరమ్మతులకు లోనై ఒడ్డ్డుపై లంగరు వేసి ఉన్నాయి. పనిచేస్తున్న కొద్దిపాటి స్టీమర్లకూ తగినంత ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో సముద్రంలో పూర్తిగా గస్తీ నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న అనేక పోస్టులు మంజూరైనప్పటికీ వాటిని భర్తీ చే యడంలేదు. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే సేకరించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు దాడులుచేసి దాదాపు 200 మంది అమాయకులను హతమార్చారు. ఉగ్రవాదులంతా సముద్రమార్గం మీదుగా నగరంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో తీర ప్రాంతాల వెంబడి గస్తీ మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అందుకు 27 ఆధునిక స్టీమర్లు, గస్తీ పడవలు కొనుగోలు చేసింది.
కాని ప్రభుత్వ ఉదాసీనతవల్ల అందులో 18 పనిచేయకుండా పోయాయి. ఇదిలాఉండగా ఈ స్టీమర్ల హాల్టు కోసం నగరంలో మడ్ ఐ ల్యాండ్, బాంద్రా, కఫ్ పరేడ్, గీత్‌నగర్ (ససూన్ డాక్) వద్ద సముద్రం ఒడ్డున ప్లాట్‌ఫాం(జెట్టి)లు నిర్మించాలని ప్రతిపాదించారు. మెరీటైం బోర్డు సమర్పించిన రూ.27 కోట్ల ఖర్చుతో కూడిన ఈ ప్రతిపాదన అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) వద్ద 2009 నుంచి అలాగే ఉంది. కాగా దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై నగర తీర ప్రాంతాల వెంబడి చమురు శుద్ధి కేంద్రాలు, బీఏఆర్సీ, జేఎన్‌పీటీ, చమురు బావులు ఇలా అనేక కీలక సంస్థలు ఉన్నాయి. ముంబై, రాయ్‌గఢ్, ఠాణే వెంబడి 117 కి.మీ. తీరప్రాంతం ఉంది. అయితే ప్రస్తుతం ఈ తీర ప్రాంత భద్రత కేవలం తొమ్మిది స్టీమర్లపై ఆధారపడి ఉండటం శోచనీయం. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ గస్తీ నౌకల పరిస్థితి దుర్భరంగా ఉంది. గేర్ బాక్స్ మరమ్మతులు, అయిల్, వాటర్ లీకేజీ, స్టార్టింగ్ ట్రబుల్, ఇంజిన్ ఆగిపోవడం, స్టీరింగ్ జాం తదితర అనేక సమస్యలతో ఒడ్డున పడి ఉన్న 18 నౌకల నిర్వహణ బాధ్యతలు ఏ సంస్థకూ అప్పగించకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు.
స్టీమర్ల కొరతవల్ల భద్రతా సిబ్బంది పూర్తిగా గస్తీ నిర్వహించలేకపోతున్నారు. తీరప్రాంతాల భద్రతను గాలికి వదిలేయడంతో ఉగ్రవాదులు మళ్లీ నగరంలో చొరబడే అవకాశాలు లేకపోలేదు. టోల్‌నాకాల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి పారిపోతే వారి ఆనవాళ్లు గుర్తించడం కూడా కష్టతరం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తీర ప్రాంత పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. కాని దీనిపై ఇంతవరకు ఎలాంటి కదలికలు మొదలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 800 ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న నౌకలు కూడా ఆగుతాయి. ఇలాంటివి ముంబైలో దాదాపు 60 ఉన్నాయి. కాని భద్రతా సిబ్బంది కొరతవల్ల ఈ పాయింట్ల వద్ద తగినంత సిబ్బందిని నియమించలేకపోతున్నారు. ఇటీవల నిర్వహించిన మాక్ డ్రిల్‌లో కూడా ఈ అంశం స్పష్టమైంది. 2007-2010 మధ్య కాలవ్యవధిలో తీర ప్రాంతాల భద్రత కోసం మంజూరు చేసిన రూ.590 కోట్లలో కేవలం రూ.325 కోట్లే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదిలా వుండగా ఇంధనం కోసం తగినన్ని నిధులు ఇవ్వడం లేదు. 2009 ఏప్రిల్ నుంచి 2012 డిసెంబరు వరకు పెట్రోల్ కోసం రూ.2,57,46,476 ఖర్చయ్యాయి.
అంటే రోజుకు రూ.25,592 విలువైన పెట్రోల్ మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదే కాలంలో డీజిల్ కోసం రూ.98,95,596 ఖర్చుకాగా రోజుకు రూ.9,836 డీజిల్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు స్పష్టమైతోంది. ఈ గణాంకాలను బట్టి సరాసరిగా ఒక్కో గస్తీ నౌకకు 17-23 లీటర్ల ఇంధనం మాత్రమే సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ ఇంధనంతో గస్తీ ఎన్ని ట్రిప్పులు కొట్టాలనే ప్రశ్న పోలీసులను వేధిస్తోంది.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం గస్తీకి వెళ్లే టప్పుడు ఒక్కో నౌకలో ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ లేదా అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉండాలి, కాని సిబ్బంది కొరతవల్ల అవసరాన్ని బట్టి సిబ్బందిని పంపిస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో తీరప్రాంతాల్లో గస్తీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 2008 నవంబరు సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిబ్బందితోపాటు ఒడ్డున పడి ఉన్న గస్తీ నౌకల మరమ్మతులు, ఇంధనం సరఫరా మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మూలన పడిన గస్తీ స్టీమర్లు
Published Tue, Aug 13 2013 11:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement