బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.
కోవిడ్ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.
ఇది ఎలా పని చేస్తుందంటే..
చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్ అందుకోవచ్చు.
ఆధార్ కార్డు తప్పనిసరి
పీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
పీఎం స్వనిధి వెబ్‌సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.
మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.
ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.
ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరి వడ్డీ రేటు
ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్‌ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment