అవి హెచ్చరికలే!
= నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిపై పరమేశ్వర
= జాగ్రత్తగా ‘లోక్సభ’ అభ్యర్థుల ఎంపిక
= ఉత్తములకే టికెట్లు.. సిట్టింగ్లకు నో గ్యారంటీ
= ప్రభుత్వానికి గవర్నర్ సలహాలివ్వడం సాధారణమే
= ఆయన్ను బదిలీ చేయించడానికి ఎలాంటి కుట్రలూ జరగడం లేదు
= కొద్ది నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది
= ఆయన్ను బదిలీ చేయించాల్సిన అవసరం లేదు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం పార్టీకి నిజంగా ప్రమాద సూచికేనని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర అంగీకరించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ ఫలితాల కారణంగా వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రస్తుత ఎంపీల నడవడికను గమనించి, ఎన్నికల్లో టికెట్లు ఇస్తామే తప్ప, సిట్టింగ్లకు
గ్యారంటీ మాత్రం లేదని నర్మగర్భంగా చెప్పారు. కాగా మంత్రుల తీరుపై గవర్నర్ హెచ్ఆర్. భరదాజ్ అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం లాంటి సమాచారం తనకు తెలియాల్సిన ఆగత్యం లేదన్నారు. ప్రభుత్వానికి గవర్నర్ సలహాలు ఇవ్వడం సాధారణమేనన్నారు. గతంలో బీజేపీ హయాంలో కూడా ఆయన పలు సార్లు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. గవర్నర్ను బదిలీ చేయించడానికి మంత్రులు, పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. మరో కొద్ది నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుందని, కనుక ఇప్పుడు బదిలీ చేయించాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఈ నెల 14న పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుందని, అందులో లోక్సభ ఎన్నికలకు ఆశావహుల జాబితాను సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు.
మేడంతో భేటీ రద్దు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. దీనికి తోడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి వల్ల సంతాప దినాలు పాటిస్తున్నందుందున జన్మ దినాన్ని జరుపుకోకూడదని ఆమె నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో తనను కలవడానికి ఎవరూ రావద్దని ఆమె సూచించినట్లు సమాచారం.