‘రియల్‌’ మోసాలకు రేరాతో చెక్‌!  | Minister KTR started the Rera Authority office | Sakshi
Sakshi News home page

‘రియల్‌’ మోసాలకు రేరాతో చెక్‌! 

Published Sat, Sep 1 2018 1:06 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Minister KTR started the Rera Authority office - Sakshi

రేరా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్, దత్తాత్రేయ. చిత్రంలో మల్లారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి కొనుగోలుదారులు ఇకపై మోసపోవడం ఉండదని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. స్థిరాస్తి వ్యాపారులు, కొనుగోలుదారుల మధ్య వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఆథారిటీ (రేరా) కృషి చేస్తుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో రేరా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం తీసుకొచ్చిన రేరా చట్టం 2017 జనవరి 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. నాటి నుంచి 500 చదరపు మీటర్లకు మించిన విస్తీర్ణంలో నిర్మాణం ప్రారంభించిన స్థిరాస్తి ప్రాజెక్టులన్నింటినీ బిల్డర్లు తప్పనిసరిగా రేరా ఆథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 2017 జనవరి 1 నుంచి నిర్మాణ అనుమతి పొందిన ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు 3 నెలల ప్రత్యేక సమయం ఇస్తున్నాం. రేరా వెబ్‌సైట్‌ (www.rera.telan gana.gov.in)లో స్థిరాస్తి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం కొనుగోలుదారులకు అం దుబాటులో ఉంటుంది’’అని తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతులు, నిర్మిత, అమ్మకానికి పెట్టిన వైశాల్యం వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. 

రేరా అథారిటీకి ఫిర్యాదు చేయండి.. 
ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న సమాచారాన్ని ప్రతి బిల్డర్‌ తెలియజేయాల్సి ఉంటుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బిల్డర్లు ప్రతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక ఎస్క్రో బ్యాంకు ఖాతాను తెరిచి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యయ లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కొనుగోలుదారులకు ఏ సమస్య వచ్చినా రేరా ఆథారిటీకి ఫిర్యాదు చేయాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు కోర్టుల్లో వాదనలు విని నిపుణులు తీర్పునిస్తారని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ప్రతి మూడు నెలలకోసారి రేరాకు బిల్డర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2017 జనవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాజెక్టులే రేరా పరిధిలోకి వచ్చినా, అంతకు ముందు ప్రార ంభించిన ప్రాజెక్టుల విషయం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్, రేరా ఆథారిటీ చైర్మన్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్, డైరెక్టర్‌ శ్రీదేవి పాల్గొన్నారు. 

రియల్‌ ఎస్టేట్‌ దూకుడు 
హైదరాబాద్‌ నగరంలో స్థిరాస్తి రంగం మంచి దూకుడు మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో స్థిరాస్తి రంగం ఏమవుతుందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, కాని అనుమానాలను తలకిందులు చేస్తూ స్థిరాస్తి రంగం గణనీయ వృద్ధి సాధించిందన్నారు. మరో రెండేళ్లలో హైదరాబాద్‌.. బెంగళూరును వెనక్కి నెట్టనుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement