
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా).. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించే చట్టం. కేంద్రం రెరాను ప్రతిపాదించి రెండేళ్లు దాటినా నేటికీ దేశంలో రెరా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నేటికీ కొన్ని రాష్ట్రాలు కనీసం రెరా నిబంధనలను ఖరారు చేయలేదు. కొన్ని రాష్ట్రాలైతే నిబంధనలను ఓకే చేసి.. ప్రాజెక్ట్‌ల నమోదు కోసం వెబ్‌సైట్ అభివృద్ధిని అటకెక్కించేశాయి.
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెరాను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చూస్తే.. రెరా నిబంధనల ఖరారు, ప్రాజెక్ట్‌ల నమోదు, ఉల్లంఘనలకు శిక్షలు వంటి అన్ని దశల్లోనూ రెరా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ముందున్నది ఒక్క మహారాష్ట్రనే. అ తర్వాత ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల గణాంకాలను చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 25 ప్రాజెక్ట్‌లు, 17 మంది ఏజెంట్లు, తెలంగాణలో 16 ప్రాజెక్ట్‌లు, ఐదుగురు ఏజెంట్లు నమోదయ్యారు.
32,306 ప్రాజెక్ట్‌లో రెరాలో నమోదు..
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32,306 ప్రాజెక్ట్‌లు, 23,111 ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 17,353 ప్రాజెక్ట్‌లు, 15,634 మంది ఏజెంట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 3,950 ప్రాజెక్ట్‌లు, 1,799 మంది ఏజెంట్లు, గుజరాత్‌లో 3,300 ప్రాజెక్ట్‌లు, 620 మంది ఏంజెట్లు, కర్ణాటకలో 1,982 ప్రాజెక్ట్‌లు, 1,069 మంది ఏజెంట్లు, మధ్యప్రదేశ్‌లో 1,901 ప్రాజెక్ట్‌లు, 426 మంది ఏజెంట్లు నమోదయ్యాయి. బిహార్‌లో 40 ప్రాజెక్ట్‌లు, ఛత్తీస్‌గఢ్‌లో 664, గోవాలో 256, హర్యానాలో 400, హిమాచల్‌ప్రదేశ్‌లో 20, జార్ఖండ్‌లో 30, ఒరిస్సాలో 123. పంజాబ్‌లో 566, రాజస్థాన్‌లో 807, తమిళనాడులో 635, ఉత్తరాఖండ్‌లో 155, దాద్రా అండ్ నగర్ హవేలిలో 69, ఢిల్లీలో 14 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి.
నిబంధనలను ఖరారు చేయనివి: అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, కేరళ, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ.
నిబంధనలు ఖరారు చేసి.. వెబ్‌సైట్ ప్రారంభించని రాష్ట్రాలు: అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి.
నిబంధనల సడలింపు
కేంద్ర ప్రతిపాదించిన రెరా నిబంధనలను చాలా వరకు రాష్ట్రాలు నిబంధనలను సడలించాయి. వాటిల్లో ప్రధానమైనవివే..
♦ ‘నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లు’ అంశంలో మినహాయింపునిచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో అనుమతులు తీసుకున్న ప్రాజెక్ట్‌లను రెరా నుంచి మినహాస్తే, మరికొన్ని శ్లాబ్, సగం నిర్మాణం పూర్తయిన వాటిని నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లుగా పరిగణించి రెరా నుంచి మినహాయింపునిచ్చాయి.
♦ నిబంధనలను ఉల్లంఘించిన డెవలపర్లకు విధించే రెరా శిక్షలు, జరిమానాల్లో సడలింపు.
♦ ఎస్క్రో ఖాతా నుంచి సొమ్మును ఉపసంహరించుకునే వీలు కల్పించడం.
♦ నిర్మాణ లోపాలపై ఐదేళ్ల వారంటీ వంటి వాటిని తొలగించడం.
♦ డెవలపర్ల మీద కేసుల నమోదు రుసుములనూ మినహాయించడం.
అనుమతులిచ్చే విభాగాలూ రెరా పరిధిలోకి
రెరా అసలైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్మాణ అనుమతులిచ్చే ప్రభుత్వ సంస్థలు కూడా రెరా పరిధిలోనే ఉండాలి. అప్పుడు కొనుగోలుదారులకు, నిర్మాణ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అందరికీ జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుంది. – అనూజ్‌పురీ, చైర్మన్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ.
Comments
Please login to add a commentAdd a comment