Foreign Capital Flows Into Real Estate During 2017-2021 Jumps 3 Times To 23bn - Sakshi
Sakshi News home page

Foreign Capital: రియల్‌ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడుల వరద

Published Thu, Mar 10 2022 3:15 AM | Last Updated on Thu, Mar 10 2022 9:24 AM

Foreign Capital Flows Into Real Estate - Sakshi

న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017–21 సంవత్సరాల మధ్య రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 23.9 బిలియన్‌ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్టు కొలియర్స్‌–ఫిక్కీ నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే 60 శాతంగా ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడం విదేశీ ఇన్వెస్టర్లలో జోష్‌ నింపింది. ‘భారత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో ఈ నివేదిక విడుదలైంది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్‌ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్‌ వివరించింది. 

పెట్టుబడుల వివరాలు.. 
2017–21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012–16 మద్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2012–21 మధ్యలో భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017–21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. 

ఆఫీస్‌ స్పేస్‌కు పెద్ద పీట 
రియల్‌ ఎస్టేట్‌లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017–21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్‌ స్పేస్‌ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017–21 మధ్య ఏటా 2 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉన్నాయి.  

నివాసిత ప్రాజెక్టుల పట్ల అప్రమత్తత  
ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం తర్వాత గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017–21 మధ్య 11 శాతానికి తగ్గింది. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఇది 37 శాతంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. ఆల్టర్నేటివ్‌ అసెట్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి.  

డేటా సెంటర్ల బూమ్‌ 
డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్‌కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement